వాషింగ్టన్, జూన్ 2: లెబనాన్‌లో సైనిక చర్యను ఇజ్రాయెల్ తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై ఫోన్లో బూతులతో విరుచుకుపడినట్లు తెలుస్తున్నది. అదే సమయంలో ఇరాన్‌తో జరుగుతున్న చర్చలకు ఈ ఘర్షణలు ఆటంకం కలిగించకుండా నివారించేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నది. బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాల్లోని హెజ్బొల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులకు ఆదేశించడం, దక్షిణ లెబనాన్‌లో భూతల దాడులను విస్తరించడం వంటి చర్యల తర్వాత ఈ అసాధారణ ఘర్షణ చోటుచేసుకుంది. ఈ చర్యలు విస్తృత ప్రాంతీయ యుద్ధం జరుగుతుందనే భయాలను పెంచడంతోపాటు ఇరాన్ నుంచి కొత్త హెచ్చరికలకు దారితీశాయి.
ఇజ్రాయెల్‌ను అంతర్జాతీయంగా ఏకాకిని చేస్తూ ఇరాన్‌తో అమెరికా దౌత్య ప్రయత్నాలకు ప్రమాదం కలిగిస్తున్నారని నెతన్యాహుపై ట్రంప్ ఆగ్రహం ప్రకటించినట్లు ఆక్సియోస్ వార్తాసంస్థ పేర్కొన్నది. నెతన్యాహును ట్రంప్ పిచ్చివాడిగా అభివర్ణించారని, పర్యవసానాలను పట్టించుకోకుండా నెతన్యాహు వ్యవహరిస్తున్నారని ఆరోపించారని ఈ సంభాషణల గురించి సమాచారం ఉన్న ఇద్దరు అమెరికన్ అధికారులను వార్తాసంస్థ ఉటంకించింది. నీకు పిచ్చిపట్టింది. నేను లేకపోతే ఈపాటికి నువ్వు జైల్లో ఉండేవాడివి. నేను నిన్ను కాపాడుతున్నాను. ఇప్పుడు అందరూ నిన్ను ద్వేషిస్తున్నారు. దీని కారణంగా అందరూ ఇజ్రాయెల్‌ను ద్వేషిస్తున్నారు అంటూ ట్రంప్ నెతన్యాహును ఉద్దేశించి మండిపడ్డారని అమెరికా అధికారి ఒకరు చెప్పారు.
పదేపదే హెజ్బొల్లా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం, ఇజ్రాయెల్ భూభాగంపై దాడులు చేయడం వంటి కారణాలు చూపుతూ బీరుట్‌లోని దహియే జిల్లాలో హెజ్బొల్లా నియంత్రణలో ఉన్న ప్రాంతాలపై దాడులకు నెతన్యాహు, రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ ఆదేశించడంతో సోమవారం పరిస్థితి తీవ్రతరమైంది. ఈ ప్రకటన వెలువడటంతో లెబనీస్ రాజధాని దక్షిణ శివారు ప్రాంతాల నివాసితులు తమ ఇండ్లను వదిలి సురక్షిత ప్రదేశాలకు పారిపోయారు. అమెరికాతో కుదిరే ఏ విస్తృత అవగాహనలోనైనా లెబనాన్‌లో కాల్పుల విరమణ ఒక కీలకమైన అంశమని ఇరాన్ అధికారులు స్పష్టం చేశారు. కాగా, నెతన్యాహుతో ట్రంప్ జరిపిన సంభాషణలు ప్రభావం చూపాయి.
బీరుట్‌లోని హెజ్బొల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ ఇక ఎంతమాత్రం దాడులు చేయబోదని ఇజ్రాయెల్ అధికారి ఒకరు ఆక్సియోస్‌కు తెలిపారు. ఆ తర్వాత తాను నెతన్యాహుతో మాట్లాడానని, బీరుట్ వైపు వెళుతున్న ఇజ్రాయెల్ దళాలను వెనక్కి పంపించారని ట్రంప్ చెప్పారు. ఇజ్రాయెల్‌పై దాడులను నిలిపివేయడానికి మధ్యవర్తుల ద్వారా హెజ్బొల్లా అంగీకరించిందని కూడా ఆయన పేర్కొన్నారు.