చిలిపిచెడ్, జూన్ 2: ధాన్యం కొనుగోలు చేయకుండా సర్కార్ డ్రామాలు ఆడుతున్నదని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి విమర్శించారు. ప్రభుత్వానికి, అధికారులకు రైతుల సమస్యలు, కడుపు కోతలు కనిపిస్తా లేవా? అని ప్రశ్నించారు. జి ల్లా అధికారులు కొనుగోలు కేంద్రాలకు వస్తున్నారు.. ఫోన్లో ఫొటోలు దిగి పోతున్నారు.. కానీ రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. మంగళవారం మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చిట్కుల్ చౌరస్తా లో మెదక్-జోగిపేట రోడ్డుపై రైతులతో కలిసి రెండు గంటలపాటు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం రైతుల బాధలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తడిసిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా చేసినందుకు గాను పోలీసులు.. ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డితోపాటు బీఆర్ఎస్ నాయకులు అరెస్టు చేశారు.