GLP 1 Medicine | ఊబకాయం, టైప్-2 మధుమేహం వంటి సమస్యలు పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలను ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బరువు తగ్గడానికి, రక్తంలో చక్కెర నియంత్రణకు ఉపయోగించే జీఎల్పీ-1తరగతి మందులు మరో విధంగా కూడా ప్రయోజనం కలిగిస్తాయని ఇటీవలి పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ మందులు తీసుకున్న కొంతమంది పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరిగినట్లు అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే వీటిని నేరుగా టెస్టోస్టెరాన్ పెంచే మందులుగా పరిగణించడం సరైంది కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పురుషుల్లో టెస్టోస్టెరాన్ తగ్గడానికి కేవలం వృషణాల్లో సమస్యలే కారణం కావాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకునే కొవ్వుతో సహా అధిక శరీర కొవ్వు హైపోథాలమస్-పిట్యూటరీ-గోనాడల్ (హెచ్పీజీ) అక్షం పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇది మెదడు, హార్మోన్ల వ్యవస్థ, పునరుత్పత్తి అవయవాల మధ్య జరిగే హార్మోన్ల సంకేతాలను నియంత్రిస్తుంది. ఇన్సులిన్ నిరోధకత, శరీరంలో దీర్ఘకాలిక స్వల్పస్థాయి వాపు, లెప్టిన్ సంకేతాల్లో మార్పులు, కొవ్వు కణజాలంలో టెస్టోస్టెరాన్ ఈస్ట్రోజెన్‌గా మారడం వంటి అంశాలు కూడా హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. అందువల్ల అధిక బరువు ఉన్న పురుషుల్లో టెస్టోస్టెరాన్ తక్కువగా ఉన్నప్పుడు, టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని మాత్రమే పరిశీలించడం ద్వారా పూర్తి కారణాన్ని అర్థం చేసుకోవడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు.
జీఎల్పీ-1 రిసెప్టర్ అగోనిస్టులు, టెస్టోస్టెరాన్ స్థాయిల మధ్య సంబంధంపై పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి. 2025లో ప్రచురితమైన ఒక సిస్టమాటిక్ రివ్యూ, మెటా-అనాలిసిస్లో ఏడు అధ్యయనాలకు చెందిన 680 మంది పాల్గొన్నారు. జీఎల్పీ-1 మందులతో చికిత్స పొందిన వారిలో మొత్తం టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరిగినట్లు ఈ విశ్లేషణలో తేలింది. అదే సమయంలో శరీర బరువు, బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ), నడుము చుట్టుకొలత, హెచ్‌బీఏ1సీ స్థాయిలు కూడా తగ్గినట్లు గుర్తించారు. 2026లో ప్రచురితమైన మరో సిస్టమాటిక్ రివ్యూలో 10 అధ్యయనాలకు చెందిన 639 మంది పురుషుల డేటాను పరిశీలించారు. జీఎల్పీ-1 చికిత్స సమయంలో మొత్తం టెస్టోస్టెరాన్ సాధారణంగా పెరిగినట్లు ఇందులో వెల్లడైంది. ముఖ్యంగా ఊబకాయం, టైప్-2 మధుమేహం లేదా ఫంక్షనల్ హైపోగోనాడిజం ఉన్న పురుషుల్లో ఈ మార్పు ఎక్కువగా కనిపించింది. అయితే ఫ్రీ టెస్టోస్టెరాన్ విషయంలో ఫలితాలు అంత స్థిరంగా లేవు. మొత్తం టెస్టోస్టెరాన్, ఫ్రీ టెస్టోస్టెరాన్ రెండూ ఒకటే కావు. రక్తంలో ఎక్కువ భాగం టెస్టోస్టెరాన్ కొన్ని ప్రోటీన్లకు అనుసంధానమై ఉంటుంది. కొంత భాగం మాత్రమే స్వేచ్ఛగా లేదా ఫ్రీ రూపంలో ఉంటుంది. శరీర కణజాలాలకు జీవశాస్త్రపరంగా అందుబాటులో ఉండేది ప్రధానంగా ఈ ఫ్రీ టెస్టోస్టెరాన్. కాబట్టి ఒక రకమైన టెస్టోస్టెరాన్ స్థాయి పెరిగిందని, పురుష హార్మోన్ల పనితీరు మొత్తం మెరుగుపడిందని అర్థం చేసుకోకూడదు.
జీఎల్పీ-1 మందులు నేరుగా పురుషుల పునరుత్పత్తి హార్మోన్ల వ్యవస్థపై పనిచేస్తున్నాయా, లేక బరువు తగ్గడం, ఇన్సులిన్ నిరోధకత తగ్గడం, మెరుగైన మెటబాలిక్ ఆరోగ్యం కారణంగానే టెస్టోస్టెరాన్ పెరుగుతోందా అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఊబకాయం సాధారణ పునరుత్పత్తి హార్మోన్ల సంకేతాలను అణిచివేస్తుంది. శరీర బరువు, ఇన్సులిన్ నిరోధకత, మెటబాలిక్ ఆరోగ్యం మెరుగుపడినప్పుడు ఈ హార్మోన్లలో కూడా కొంత మెరుగుదల వచ్చే అవకాశం ఉంటుంది. ఊబకాయం కారణంగా టెస్టోస్టెరాన్ తగ్గిన పురుషుల్లో లిరాగ్లుటైడ్ను టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీతో పోల్చిన ఒక అధ్యయనం కూడా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. 16 వారాల తర్వాత రెండు గ్రూపుల్లోనూ టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరిగాయి. అయితే లిరాగ్లుటైడ్ తీసుకున్నవారిలో బరువు తగ్గడం గణనీయంగా ఎక్కువగా ఉంది. ఈ గ్రూపులో సగటున 7.9 కిలోల బరువు తగ్గగా, టెస్టోస్టెరాన్ చికిత్స పొందిన గ్రూపులో సుమారు 0.9 కిలోల బరువు మాత్రమే తగ్గింది. లిరాగ్లుటైడ్ తీసుకున్నవారిలో ల్యూటినైజింగ్ హార్మోన్ (ఎల్‌హెచ్), ఫాలికిల్-స్టిమ్యులేటింగ్ హార్మోన్ (ఎఫ్ఎస్హెచ్) స్థాయిలు కూడా పెరిగాయి. ఇవి శరీరంలోని సహజ పునరుత్పత్తి హార్మోన్ల సంకేతాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. దీనివల్ల జీఎల్పీ-1 మందులు టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ కంటే భిన్నమైన విధానంలో పనిచేస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు.
టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ ద్వారా రక్తంలో టెస్టోస్టెరాన్ స్థాయిలని పెంచవచ్చు. అయితే బయట నుంచి టెస్టోస్టెరాన్ అందించడం వల్ల శరీరం స్వయంగా ఉత్పత్తి చేసే ఎల్‌హెచ్, ఎఫ్ఎస్హెచ్ తగ్గిపోతాయి. ఫలితంగా వృషణాలకు అందే సహజ హార్మోన్ల ప్రేరణ తగ్గి, స్పెర్మ్ ఉత్పత్తి, సంతానోత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. జీఎల్పీ-1 మందులు మాత్రం పూర్తిగా భిన్నమైన మార్గంలో పనిచేస్తాయి. జీఎల్పీ-1 చికిత్స, టెస్టోస్టెరాన్, పురుషుల సంతానోత్పత్తి మధ్య సంబంధంపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. ఊబకాయం, టైప్-2 మధుమేహం, ఫంక్షనల్ హైపోగోనాడిజం ఉన్న పురుషుల్లో సెమాగ్లుటైడ్‌ను టెస్టోస్టెరాన్ థెరపీతో 24 వారాల పాటు పోల్చిన చిన్న ర్యాండమైజ్డ్ ట్రయల్‌లో హార్మోన్లతోపాటు వీర్యానికి సంబంధించిన అంశాలను కూడా పరిశీలించారు. అయితే టెస్టోస్టెరాన్ స్థాయి ఒక్కటే పురుషుల సంతానోత్పత్తిని నిర్ణయించదు. ప్రస్తుతం జీఎల్పీ-1 మందులు పురుషుల సంతానలేమి లేదా తక్కువ టెస్టోస్టెరాన్‌కు ప్రత్యేక చికిత్సగా ఉపయోగించేందుకు తగినంత ఆధారాలు లేవు. ఈ మందులు సంతానోత్పత్తిపై చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి మరిన్ని పెద్ద, దీర్ఘకాలిక అధ్యయనాలు అవసరం.
బరువు తగ్గిన ప్రతి పురుషుడిలోనూ టెస్టోస్టెరాన్ ఒకే విధంగా పెరగదు. తక్కువ టెస్టోస్టెరాన్‌కు కారణం ఊబకాయం తీవ్రత, ఇన్సులిన్ సెన్సిటివిటీ, నిద్ర నాణ్యత, వయస్సు, వాడుతున్న మందులు, ఇతర ఆరోగ్య సమస్యలు వంటి అనేక అంశాలు దీనిపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా నిద్రలేమి, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా వంటి నిద్ర సంబంధిత సమస్యలు కూడా టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తాయి. పోషకాహారం, అతిగా క్యాలరీలను తగ్గించడం వంటి అంశాలు కూడా పునరుత్పత్తి హార్మోన్లపై ప్రభావం చూపిస్తాయి. అందువల్ల టెస్టోస్టెరాన్ను ఒకే రక్త పరీక్షలో కనిపించే సంఖ్యగా కాకుండా, మొత్తం మెటబాలిక్ ఆరోగ్యంలో ఒక భాగంగా చూడాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం జీఎల్పీ-1 రిసెప్టర్ అగోనిస్టులను కేవలం టెస్టోస్టెరాన్ పెంచేందుకు ఉపయోగించడం సరైంది కాదు. ఈ మందులు ప్రధానంగా ఊబకాయం, టైప్-2 మధుమేహం వంటి పరిస్థితుల కోసం, సంబంధిత మందును బట్టి వైద్యుల సూచనతో ఉపయోగిస్తారు. లైంగిక కోరిక తగ్గడం, అంగస్తంభన సమస్యలు, అలసట, కండరాల ద్రవ్యరాశి తగ్గడం వంటి లక్షణాలు ఉన్న పురుషులు స్వయంగా జీఎల్పీ-1 మందులు లేదా టెస్టోస్టెరాన్ థెరపీ ప్రారంభించకూడదు. తక్కువ టెస్టోస్టెరాన్ను నిర్ధారించడానికి కూడా సరైన వైద్య పరీక్షలు అవసరం. టెస్టోస్టెరాన్ స్థాయిలు మారుతూ ఉంటాయి కాబట్టి ఒక్క రక్త పరీక్షతోనే హైపోగోనాడిజాన్ని నిర్ధారించడం సాధ్యం కాదు. సాధారణంగా లక్షణాలతో పాటు ఉదయం సమయంలో టెస్టోస్టెరాన్ పరీక్షను మళ్లీ చేయడం, అవసరాన్ని బట్టి ఇతర హార్మోన్ పరీక్షలు నిర్వహించడం ద్వారా అసలు కారణాన్ని గుర్తించేందుకు వైద్యులు ప్రయత్నిస్తారు. 2025లోని మెటా-అనాలిసిస్లో జీఎల్పీ-1 రిసెప్టర్ అగోనిస్టులతో బయోఅవైలబుల్ టెస్టోస్టెరాన్లో గణనీయమైన మెరుగుదల కనిపించినప్పటికీ, ఫ్రీ టెస్టోస్టెరాన్, సెక్స్ హార్మోన్-బైండింగ్ గ్లోబులిన్ (ఎస్హెచ్బీజీ)లో వచ్చిన మార్పులు గణాంకపరంగా గణనీయంగా లేవని తేలింది. ఈ అంశంపై మరింత విస్తృతమైన, మెరుగైన అధ్యయనాలు అవసరం.
జీఎల్పీ-1 మందులు కొంతమంది పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచే అవకాశం ఉందని ప్రస్తుత పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఊబకాయం, టైప్-2 మధుమేహం లేదా ఫంక్షనల్ హైపోగోనాడిజం ఉన్నవారిలో ఈ ప్రభావం కనిపిస్తుంది. అయితే వీటిని టెస్టోస్టెరాన్ పెంచే మందులుగా చూడటం తొందరపాటు నిర్ణయమే. టెస్టోస్టెరాన్ తగ్గడానికి ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకత, నిద్రలేమి వంటి మెటబాలిక్ సమస్యలు కారణమైతే, వాటిని నియంత్రించడం ద్వారా కొంతమందిలో టెస్టోస్టెరాన్ సహజంగానే మెరుగుపడే అవకాశం ఉంటుంది. అందుకే టెస్టోస్టెరాన్ను ఎలా పెంచాలి? అనే ప్రశ్నతో పాటు అది ఎందుకు తగ్గింది? అనే ప్రశ్నకు సమాధానం కనుగొనడం మరింత ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.