Ghee On Empty Stomach | పాలతో తయారు చేసే పదార్థాల్లో నెయ్యి కూడా ఒకటి. నెయ్యి మన ఆహారానికి చక్కటి రుచిని అందిస్తుంది. నెయ్యితో మనం అనేక తీపి వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. నెయ్యితో చేసే వంటకాలను అందరూ ఇష్టపడతారని చెప్పవచ్చు. నెయ్యిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఆయుర్వేదంలో నెయ్యిని అనేక చికిత్సల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఆహారంతో కలిపి నెయ్యిని తీసుకోవడానికి బదులుగా నెయ్యిని ఉదయం పూట తీసుకోవడం వల్ల మనం మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. మన ఉదయాన్ని నెయ్యితో ప్రారంభించడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి వారు వివరిస్తున్నారు.
నెయ్యిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణశయాంతర ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రేగు కదలికలు మెరుగుపడతాయి. దీంతో ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది దాని యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలకు ప్రసిద్ది చెందింది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాల వల్ల పేగు ఆరోగ్యంతో పాటు శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నెయ్యిలో శోథ నిరోధక లక్షణాలు కూడా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల వాపులు, నొప్పులు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. నెయ్యిని తీసుకోవడం వల్ల విటమిన్ ఎ, డి, ఇ, కె వంటి పోషకాలను మన శరీరం ఎక్కువగా గ్రహించుకుంటుంది. దీంతో శరీరంలో ఆయా విటమిన్ల లోపం లేకుండా ఉంటుంది.
నెయ్యిలో ఉండే కొవ్వు ఆమ్లాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. అభిజ్ఞా పనితీరును మెరుగుపరచడంలో, జ్ఞాపకశక్తిని పెంచడంలో, ఏకాగ్రతను పెంచడంలో కూడా నెయ్యి మనకు సహాయపడుతుంది. నెయ్యిని తీసుకోవడం వల్ల శరీర శక్తి స్థాయిలు పెరుగుతాయి. అంతేకాకుండా దీనిలో ఉండే కొవ్వులు, విటమిన్లు చర్మం, జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నెయ్యిని ఉదయం పూట తీసుకోవడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. తద్వారా శరీర బరువు అదుపులో ఉంటుంది. నెయ్యిని తీసుకోవడం వల్ల గుండె, ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈవిధంగా నెయ్యి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఉదయం పూట తీసుకోవడం వల్ల మనం మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే నెయ్యి మన ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికీ దీనిని తగిన మోతాదులో తీసుకోవడం చాలా అవసరం. దీనిని అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.
దీనిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. కనుక దీనిని అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల శరీర బరువు పెరుగుతుంది. నెయ్యిని అతిగా తీసుకోవడం వల్ల గుండె జబ్బుల అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కడుపు ఉబ్బరం, విరేచనాలు, కాలేయ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. కనుక దీనిని తగిన మొత్తంలో తీసుకోవడం చాలా అవసరం. రోజూ 1 లేదా 2 టేబుల్ స్పూన్ల మోతాదులో పరగడుపున నెయ్యిని తీసుకోవాలి. దీనిని నేరుగా తీసుకోలేని వారు గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకోవచ్చు. ఇక చురుకైన వ్యక్తులు, ఆరోగ్యవంతులు మాత్రమే దీనిని పరగడుపున తీసుకోవాలి. గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్నవారు దీనిని పరగడుపున తీసుకోకూడదు. ఈ విధంగా మన ఆరోగ్యాన్ని బట్టి తగిన మోతాదులో నెయ్యిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.