క్యాన్సర్ అయినా కావొచ్చు! ‘కడుపు మంట’ అనగానే ‘ఎవర్ని చూసి?’ అని జోకేస్తాం కానీ, ఆ మంటకు కారణం ఏమిటి, మూలాలు ఎక్కడున్నాయి, ఎన్ని రోజులుగా వేధిస్తున్నది? అనే కోణంలో మాత్రం ఆలోచించం. ఎవరికి తెలుసు, ఆ వ్యక్తికి ఎసిడిటీ సమస్య ఉండొచ్చు. నిర్లక్ష్యం చేస్తే.. క్యాన్సర్గానూ మారొచ్చు. కాబట్టి, కడుపు మంటను తేలిగ్గా తీసుకోవద్దు.
ఎసిడిటీ సాధారణంగా తలెత్తే సమస్యే. పొట్టలోని ఆమ్లం అన్నవాహికలోకి ఉబికి వచ్చే గ్యాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ) లేదా అజీర్ణంతో దీనికి ప్రత్యక్ష సంబంధం ఉంది. అయితే, ఎసిడిటీ రోజుల తరబడి ఇబ్బంది పెడుతున్నా, తీవ్రంగా బాధిస్తున్నా.. దాన్ని పొట్ట, అన్నవాహిక (ఈసోఫేగల్) క్యాన్సర్ లాంటి సమస్యలకు హెచ్చరికగా అనుమానించాల్సి ఉంటుంది. అన్నిటికంటే ముందు.. ఎసిడిటీకి, దానితో ముడిపడిన క్యాన్సర్లకు మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవాలి.
వ్యాధి తొలిదశలోనే వైద్యులను సంప్రదించి, రోగ నిర్ధారణ చేయించుకోవాలి. తగిన చికిత్స తీసుకోవాలి. ఉదరకోశంలో ఆమ్లం ఉత్పత్తి అధికం కావడం, ఆ ఆమ్లం అన్నవాహికలోకి ఉబికి రావడం.. తదితర కారణాల వల్ల ఎసిడిటీ తలెత్తుతుంది. సమయానికి తినకపోవడం, పరిమితికి మించి తినడం, ఒత్తిడి, ధూమపానం, మద్యపానం .. లాంటి జీవనశైలి సమస్యలను దీర్ఘకాలిక ఎసిడిటీకి కారణాలుగా పరిగణించవచ్చు. ఇక పొట్ట క్యాన్సర్ లేదా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అనేది పొట్ట లోపలి (స్టమక్ లైనింగ్) పొరపై అభివృద్ధి చెందే కణితి. దీనిని వీలైనంత త్వరగా నిర్ధారించుకుని, తగిన చికిత్స తీసుకోవాలి. అలానే అన్నవాహిక కణజాలంలో ప్రమాదకర కణుతులు ఏర్పడితే అది అన్నవాహిక (ఈసోఫేగల్) క్యాన్సర్.
నోటి నుంచి పొట్టలోకి ఆహారాన్ని పంపే గొట్టం లాంటి నిర్మాణమే అన్నవాహిక. దీర్ఘకాలిక ఎసిడిటీ వల్ల పొట్ట, అన్నవాహిక క్యాన్సర్ ముప్పు ఎక్కువని తేలింది. పొట్టలోని పొరల మీద ఆమ్లం దీర్ఘకాలికంగా దాడిచేయడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. అలా అన్నవాహికలోకి ఆమ్లం ఉబికి రావడం అనేది.. ఛాతీలో మంట, అన్న వాహిక పొరలు క్షీణించడం, అల్సర్లు ఏర్పడటం మొదలైన ఇబ్బందులకు దారితీస్తుంది. కాలక్రమంలో పొట్ట, అన్నవాహిక కణాల్లో అసహజమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అవే క్యాన్సర్ వృద్ధికి కారణం అవుతాయి.
ఛాతీలో మంట..
ఎసిడిటీ లక్షణమైన ‘ఛాతీలో మంట’ పొట్ట క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్కు బలమైన హెచ్చరిక. పొట్టలోంచి ఆమ్లం గొంతు భాగానికి తన్నుకు రావడం వల్లే ఇలా ఛాతీలో మంటగా అనిపిస్తుంది. జీవన శైలిని సవరించుకుని ఆరోగ్యకరమైన అలవాట్లను పెంచుకున్నా, మార్కెట్లో లభించే యాంటాసిడ్స్ వాడినా.. ఆ మంట కొనసాగుతూ ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్యుణ్ని కలవాలి. ఆహారాన్ని మింగడంలో ఇబ్బంది ఎదురుకావడం, ఎలాంటి ప్రయత్నమూ లేకుండానే బరువు తగ్గడం, వికారం, ఎంతకూ తగ్గని వాంతులు, మలంలో రక్తం పడటం లాంటివి కూడా క్యాన్సర్ లక్షణాలే.
నిర్ధారణ పరీక్షలు
..పై లక్షణాలతో బాధపడుతున్న రోగికి వైద్యులు కొన్ని పరీక్షలు చేస్తారు. వీటిలో అప్పర్ ఎండోస్కోపీ ఒకటి. దీనిలో భాగంగా కెమెరా ఉన్న ఒక సాగే గొట్టాన్ని నోటి నుంచి లోపలికి చొప్పించి అన్నవాహిక, పొట్ట లైనింగ్ క్షుణ్నంగా పరిశీలిస్తారు. మరింత కచ్చితత్వం కోసం అవసరమైతే ఎండోస్కోపీ సమయంలోనే బయాప్సీ కూడా తీసుకుంటారు. దీనికి అదనంగా, క్యాన్సర్ విస్తృతి ఎంతవరకు ఉంది, ఏ మేరకు ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తున్నది.. మొదలైన వివరాలను మదింపు వేయడానికి కంప్యూటెడ్ టొమోగ్రఫీ (సీటీ) స్కానింగ్, లేదంటే మ్యాగ్నెటిక్ రెజోనెన్స్
ఇమేజింగ్ (ఎంఆర్ఐ) స్కానింగ్ కూడా చేస్తారు.
తీవ్రతను బట్టి
అన్నవాహిక, పొట్ట క్యాన్సర్ తీవ్రతను బట్టి రోగులకు తగిన చికిత్సను సిఫారసు చేస్తారు. క్యాన్సర్ తొలిదశలో ఉంటే అన్నవాహిక మధ్య, దిగువ భాగాల్లో కణుతులను సర్జరీ ద్వారా తొలగిస్తారు. ఇక క్యాన్సర్ కణితి స్థానికంగా వ్యాపించినప్పుడు.. సర్జరీతో సత్వర ఉపశమనం లభించదని భావిస్తే కీమోథెరపీ, రేడియేషన్ కలగలిపి చికిత్స అందిస్తారు. అయితే కొన్నిసార్లు క్యాన్సర్ అడ్వాన్స్ దశలో ఉంటే రోగి జీవన నాణ్యతను కొనసాగిస్తూ, కేవలం వ్యాధి లక్షణాలను నియంత్రించడమే లక్ష్యంగా వైద్యం ఉంటుంది.
ఈ చికిత్సలో సాధారణంగా కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ ద్వారా రోగికి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తారు. జీర్ణవ్యవస్థలో ఎసిడిటీకి మామూలుగా అయితే జీఈఆర్డీ లేదంటే అజీర్ణమే కారణం. అయితే తీవ్రతను బట్టి వీటిని పొట్ట, అన్నవాహిక క్యాన్సర్ల లాంటి సమస్యలుగా కూడా పరిగణించవచ్చు. ఎసిడిటీ దీర్ఘకాలం కొనసాగినా, తీవ్రంగా ఉన్నా.. దీనికితోడుగా మింగడంలో ఇబ్బంది, అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం తేలిగ్గా తీసుకోకూడదు. వైద్యులను సంప్రదించి సమస్య కారణాలు తెలుసుకోవాలి. వ్యాధి నిర్ధారణ చేయించుకుని తగిన చికిత్స తీసుకోవాలి. పొట్ట, అన్నవాహిక క్యాన్సర్లను తొలిదశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే రోగి కోలుకునే అవకాశాలు ఎక్కువ. ఆలస్యం అయినకొద్దీ రుగ్మత తీవ్రత పెరుగుతుంది.
– డా. నిఖిల్ఎస్ ఘడ్యాల పాటిల్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్, హెమటో-ఆంకాలజిస్ట్ యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్.