Gas Trouble Home Remedies | మనలో చాలామందికి జీర్ణ సమస్యలు వస్తుంటాయి. జీర్ణ సమస్యలు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. కారం, మసాలాలు అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం, వేళకు భోజనం చేయకపోవడం, అతిగా ఆహారం తినడం, రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం, పలు రకాల మందులను వేసుకోవడం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉండడం వంటి అనేక కారణాల వల్ల జీర్ణ సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా పొట్ట బిర్రుగా మారి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. పొట్ట ఉబ్బరం వస్తుంది. జీర్ణవ్యవస్థలో అవసరానికి మించి వాయువు చేరుకోవడంతో ఈ సమస్య తలెత్తుతుంది. ఈ ఇబ్బంది నుంచి ఉపశమనం దక్కాలంటే పలు చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
భోజన సమయంలో ఆహారంతో పాటు ఎక్కువగా గాలిని మింగేసినా, ద్రవాలను స్ట్రాతో పీల్చుకున్నా, గబగబా భోజనం ముగించినా పొట్ట ఉబ్బరిస్తుంది. కాబట్టి ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినాలి. శరీరానికి సరిప సరిపడని ఆహారం మానేయాలి. కొందరికి పాలు తాగితే పొట్ట ఉబ్బరిస్తుంది. అలా మీకు ఏ పదార్థంతో ఇబ్బంది కలుగుతుందో గమనించి వాటిని మానుకోవాలి. శీతల పానీయాలు తాగడం, స్ట్రా తో తాగడం లాంటి అలవాట్లు పొట్ట ఉబ్బరానికి దారి తీస్తాయి. కాబట్టి ఈ అలవాట్లు మానుకోవాలి. డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు శరీరంలో నీరు నిలువ ఉండిపోతుంది. దాంతో పొట్ట ఉబ్బరం తలెత్తుతుంది. కాబట్టి డీహైడ్రేషన్‌కు వీలు లేకుండా తరచుగా నీళ్లు తాగుతూ ఉండాలి. అయితే చల్లటి నీళ్లకు బదులుగా త్వరగా జీర్ణమయ్యేలా గోరువెచ్చని నీళ్లు తాగుతూ ఉండాలి.
కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో జీలకర్ర అద్భుతంగా పనిచేస్తుంది. జీలకర్రను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను రోజూ ఉదయం పరగడుపున తాగాలి. దీంతో జీర్ణ వ్యవస్థలో ఉండే గ్యాస్ మొత్తం బయటకు పోతుంది. కడుపు ఉబ్బరం తగ్గుతుంది. పొట్ట ఉబ్బరాన్ని తగ్గించడంలో అల్లం రసం కూడా ఎంతగానో పనిచేస్తుంది. భోజనానికి ముందు ఒక టీ స్పూన్ అల్లం రసం సేవిస్తుంటే అన్ని రకాల జీర్ణ సమస్యల నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా గ్యాస్ సమస్య తగ్గుతుంది. భోజనానికి ముందు ఒక టీ స్పూన్ పుదీనా రసాన్ని సేవిస్తున్నా కూడా జీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చు. జీర్ణవ్యవస్థను శుభ్రం చేయడంలో పుదీనా ఎంతగానో పనిచేస్తుంది. తినే ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోయినా పొట్ట ఉబ్బరంగా ఉన్నా మలబద్ధకం ఉన్నా పుదీనా ఆకుల రసం ఎంతగానో పనిచేస్తుంది.
భోజనం చేసిన అనంతరం గుప్పెడు సోంపు గింజలను తీసుకొని నోట్లో వేసి బాగా నమిలి మింగాలి. జీర్ణ సమస్యలను తగ్గించడంలో సంపు గింజలు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. సోంపు గింజలను తింటుంటే గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. పొట్ట ఉబ్బరం కూడా తగ్గుతుంది. కడుపులో మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. భోజనం చేసిన అనంతరం జామకాయలను తింటున్నా కూడా కడుపు ఉబ్బరాన్ని తగ్గించుకోవచ్చు. జామకాయల్లో విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉంటాయి. అందువల్ల భోజనం చేసిన వెంటనే జామకాయలను తింటే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది. పొట్టలో గ్యాస్ పేరుకుపోదు. కడుపు ఉబ్బరం నుంచి బయటపడవచ్చు. అలాగే ధనియాలతో కషాయం తయారు చేసి తాగుతున్నా కూడా జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ విధంగా పలు చిట్కాలను పాటిస్తే పొట్ట ఉబ్బరాన్ని తగ్గించుకోవచ్చు. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.