అపసవ్య జీవనశైలి మన శరీరంలో ఎన్నో అవయవాలపై దుష్ప్రభావం చూపుతుంది. డయాబెటిస్ మొదలుకుని శరీరంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయుల వరకు వివిధ రకాలైన సమస్యలు అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా విజృంభిస్తున్నాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయిందంటే మాత్రం గుండెపోటు, స్ట్రోక్ ముప్పు పెరిగిపోతుంది. కాబట్టి, కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రణలో ఉంచుకోవాలంటే మొట్టమొదట ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి.
Cholesterol | శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించుకోవడానికి సరైన పదార్థాలను ఆహారంలో భాగం చేసుకొని, వాటిని సుదీర్ఘకాలంపాటు కొనసాగిస్తూ ఉండాలి. దీనికోసం కొన్ని రకాలైన కూరగాయలు, ఆయుర్వేద గుణాలున్న పదార్థాలను ఎంచుకోవాలి. వీటిలో వెల్లుల్లి ఒకటి. పచ్చి వెల్లుల్లి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ట్రైగ్లిజరైడ్లను పెంచుతుంది. అంతేకాదు అధిక రక్తపోటు నియంత్రణలో కూడా వెల్లుల్లి సమర్థంగా పనిచేస్తుంది.
అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవాళ్లు పరగడుపునే పచ్చి వెల్లుల్లిపాయ తినడం మంచి ప్రయోజనాలను ఇస్తుంది. దీన్ని చప్పరించినా, నమిలినా ఎలా తిన్నా మంచిదే. వగరుగా ఉంటుంది కాబట్టి, వెల్లుల్లి తినగానే కొన్ని నీళ్లు తాగితే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ పీడ విరగడైపోతుంది. వెల్లుల్లిలో అలిసిన్ అనే మూలకం ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రక్తాన్ని పలుచన చేస్తుంది. అలా రక్తసరఫరా మెరుగుపడుతుంది. గుండె మీద ఒత్తిడి తగ్గిపోతుంది. అంటే గుండెపోటు, పక్షవాతం ముప్పు కూడా తగ్గిపోయినట్టే కదా!
వగరుగా ఉంటుంది కాబట్టి పచ్చి వెల్లుల్లి తినాలని అనుకునే వాళ్లు… ఓ వెల్లుల్లి రెమ్మను తీసుకోవాలి. దాన్ని తేనెలో ముంచి తినేయాలి. లేదంటే వెల్లుల్లిని ముక్కలుగా చేసుకుని, తేనెతో కలుపుకొని తిన్నా కూడా మేలుచేస్తుంది. ఈ మిశ్రమాన్ని ఓ వారం రోజులు నిల్వ చేసుకోవచ్చు కూడా. వారమంతా తినడానికి వీలుంటుంది. వెల్లుల్లిని పచ్చళ్లు, ఊరగాయల్లో జోడించుకోవడమూ మంచి ఆలోచనే.