వెల్లుల్లితో దక్కే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో అని తెలుసు. రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపరుస్తుంది. అధిక రక్తపోటును తగ్గిస్తుంది. అయితే, మితం తప్పితే అమృతమైనా విషమే అన్నట్టు… వెల్లుల్లిని కూడా మితంగానే వాడుకోవాలి. లేకుంటే ఆరోగ్యంపై దుష్ప్రభావాలు పడతాయి.
వెల్లుల్లిలో ఫ్రక్టాన్స్ అనే మూలకాలు ఉంటాయి. ఇవి కొంతమందికి అరగవు. దీంతో వెల్లుల్లిని ఎక్కువగా తీసుకుంటే కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి లాంటి సమస్యలు తలెత్తుతాయి. పొట్ట సమస్యలు ఉన్నవాళ్లను ఇవి మరింత ఇబ్బందిపెడతాయి. అంతేకాకుండా పొట్టలో ఆమ్లం పైకి
రావడం (యాసిడ్ రిఫ్లక్స్) వల్ల గుండెలోమంటగా అనిపిస్తుంది.
పరిష్కారం: వెల్లుల్లిని అవసరమైనంత మేరకే తినాలి. పచ్చిగా తినేకంటే ఉడికించి తీసుకోవడం మంచిది.
రక్తాన్ని పలుచన చేసే లక్షణాల గని వెల్లుల్లి. అలా ఇది గుండె కవాటాల ఆరోగ్యానికి మేలుచేస్తుంది. మోతాదు మించితే మాత్రం.. రక్తస్రావానికి కారణమవుతుంది. వార్ఫారిన్, యాస్పిరిన్ లాంటి రక్తం పలుచన చేసే మందులు తీసుకునేవారికి ఇది మరింత చేటు చేస్తుంది. అలానే ఏదైనా సర్జరీకి సిద్ధమవుతున్న వారికి కూడా మంచిది కాదు.
పరిష్కారం: రక్తం పలుచన చేసే మందులు వాడుతున్నా, సర్జరీకి వెళ్తున్నా వైద్యుల సలహా మేరకే వెల్లుల్లిని తినాలి.
వెల్లుల్లి వాడకంతో వచ్చే సాధారణమైన సమస్య నోటి దుర్వాసన. ఇది తిన్న తర్వాత కూడా చాలాసేపు ఉంటుంది. వెల్లుల్లిలో సల్ఫర్ మూలకాలు ఉంటాయి. జీర్ణం కాగానే ఇవి విడుదల అవుతాయి. అలా గాఢమైన వాసనకు దారితీస్తుంది. ఇది కొన్నిసార్లు ఇతరులకు అసౌకర్యంగా పరిణమిస్తుంది.
పరిష్కారం: వెల్లుల్లి తిన్న తర్వాత చక్కెర లేని చూయింగ్ గమ్ తినడం, నీళ్లు తాగడం, పార్స్లీ నమలడం చేయాలి. ఇవి నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. బ్రష్ చేసుకోవడం, మౌత్వాష్ వాడటం కూడా ఫలితాన్ని ఇస్తాయి.
అతికొద్ది మంది మాత్రం వెల్లుల్లి అలర్జీ కలిగి ఉంటారు. చర్మంపై ఓ మోస్తరు దద్దుర్లు, శ్వాస తీసుకోవడం కష్టం కావడం, గొంతు వాపు లాంటివి ఈ అలర్జీల్లో ప్రధానంగా ఉంటాయి. ఉల్లిపాయలతో అలర్జీ ఉంటే గనుక వెల్లుల్లితో కూడా ఉన్నట్టే అని గుర్తుంచుకోవాలి.
పరిష్కారం: వెల్లుల్లి తిన్న వెంటనే ఏదైనా అలర్జీని గమనిస్తే తినడం ఆపేయాలి. వైద్య సహాయం తీసుకోవాలి.
చర్మానికి పచ్చి వెల్లుల్లిని నేరుగా అప్లయి చేస్తే మంటగా అనిపిస్తుంది. బొబ్బలెక్కుతుంది. గాఢమైన సల్ఫర్ మూలకాల వల్ల ఇలా జరుగుతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ల చికిత్సలో వెల్లుల్లిని వాడతారు. కాకపోతే మోతాదు మించి మాత్రం వాడకూడదు. ఇలా చేస్తే బొబ్బలు, ఎర్రబడటం, మంట లాంటివి తలెత్తుతాయి.
పరిష్కారం: చర్మానికి వెల్లుల్లిని అప్లయి చేయాలనుకుంటే, దాన్ని ఏదైనా తైలంతో కలిపి చేయాలి. నేరుగా చేయకూడదు. ఒకవేళ ఇరిటేషన్ అనిపిస్తే, ఆ ప్రదేశాన్ని నీళ్లతో కడిగేసుకోవాలి. డాక్టర్ను సంప్రదించాలి.