Fruits For Heart Health | పూర్వం ఒకప్పుడు పెద్ద వారికి, అందులోనూ వయస్సు మీద పడిన వారికి మాత్రమే హార్ట్ ఎటాక్‌లు వచ్చేవి. కానీ ప్రస్తుతం చిన్న వయస్సులో ఉన్నవారు కూడా హార్ట్ ఎటాక్ ల బారిన పడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ముఖ్యంగా అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్లతోపాటు ఒత్తిడిని ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అయితే గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా పలు రకాల పండ్లను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఈ పండ్లలో అనేక విటమిన్లు, మినరల్స్, ఫైబర్, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కనుక గుండెకు అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. అలాగే ఈ పోషకాల వల్ల మనకు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇక గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తినాల్సిన పండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్ బెర్రీల వంటి బెర్రీల జాతికి చెందిన పండ్లను రోజూ తింటుంటే గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ పండ్లలో ఆంథో సయనిన్స్ అని పిలవబడే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి బీపీని నియంత్రణలో ఉంచుతాయి. రక్త నాళాల పనితీరును మెరుగు పరుస్తాయి. రక్త నాళాల వాపులు తగ్గేలా చేస్తాయి. దీని వల్ల గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. బెర్రీ పండ్లలో విటమిన్ సి, ఫైబర్, మాంగనీస్ కూడా అధికంగానే ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. దీన్ని వల్ల అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. సిట్రస్ జాతికి చెందిన నారింజ, గ్రేప్ ఫ్రూట్, నిమ్మ వంటి పండ్లను తింటుంటే విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ అధిక మొత్తంలో లభిస్తాయి. ఇవి గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్ రాకుండా చూస్తాయి. ఈ పండ్లలో అధికంగా ఉండే పొటాషియం బీపీని నియంత్రణలో ఉంచి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పండ్లను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో యాపిల్ పండ్లు కూడా ఎంతో మేలు చేస్తాయి. రోజూ ఒక యాపిల్‌ను తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదని అందరూ చెబుతుంటారు. అక్షరాలా ఇది నిజమే అని చెప్పవచ్చు. ఎందుకంటే రోజూ ఒక యాపిల్‌ను తింటే ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. ఇక యాపిల్స్‌ను తింటే పలు ఇతర లాభాలు కూడా కలుగుతాయి. అధిక బరువును తగ్గించుకోవచ్చు. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అవకాడోలు కూడా గుండెకు మేలు చేస్తాయి. ఈ పండ్లలో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ అనే ఆరోగ్యకరమైన కొవ్వులు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. బీపీ తగ్గేలా చేస్తాయి. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
అరటి పండ్లు మనకు చవకగా లభించడమే కాదు, ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటాయి. ఈ పండ్లను పోషకాలకు నెలవుగా చెప్పవచ్చు. ముఖ్యంగా వీటిల్లో ఉండే పొటాషియం బీపీని నియంత్రణలో ఉంచుతుంది. గుండె పనితీరు మెరుగు పడేలా చేస్తుంది. కనుక గుండె జబ్బులు రావొద్దంటే రోజూ ఒక అరటి పండును తింటున్నా ఎంతో మేలు జరుగుతుంది. ఇక ఈ పండ్లను తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. ద్రాక్ష పండ్లు కూడా గుండె ఆరోగ్యానికి సహాయం చేస్తాయి. ముఖ్యంగా ఎరుపు లేదా నలుపు రంగులో ఉండే ద్రాక్షలను తింటే గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. వీటిల్లో రెస్వెరెట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచి వాపులను తగ్గిస్తుంది. దీని వల్ల రక్త నాళాల్లో క్లాట్స్ ఏర్పడకుండా నిరోధించవచ్చు. దీంతో హార్ట్ ఎటాక్స్ రాకుండా అడ్డుకోవచ్చు. ఇలా ఈ పండ్లను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.