న్యూఢిల్లీ : శారీరక వ్యాయామం ఏదైనా మనల్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుతుందనడంలో సందేహం లేదు. జిమ్‌లో కసరత్తులు, యోగా క్లాసులకు హాజరవడం, సైక్లింగ్ ఇలా ఇష్టమైనా వ్యాయామం ఏది చేసినా అది మెరుగైన ఆరోగ్యాన్ని, శరీరం, మనసుకు ఉత్తేజం కల్పిస్తుంది. అయితే ఏ శారీరక వ్యాయామం ఎంచుకున్నా అది ఓ టాస్క్‌లా కాకుండా ఆ ప్రక్రియను ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగడం మెరుగైన ఫలితాలు ఇస్తుంది.
వ్యాయామాన్ని వినోదంలా చేయాలనుకునే వారికి స్విమ్మింగ్ అనువైన ఎంపిక. తేలికగా, సరదాగా అనిపించే స్విమ్మింగ్‌తో పలు ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. ఇది శరీరంలో ఏ ఒక్క భాగానికో కాకుండా అన్ని అవయవాలపైనా సానుకూల ఫలితాలు చూపుతుంది.
క్యాలరీలను కరిగించడంతో పాటు అర్ధరైటిస్, ఆస్త్మా రోగులకు ఉపశమనం కలిగిస్తుంది. రోజూ స్మిమ్మింగ్ చేయడం ద్వారా ఊపిరితిత్తులు బలోపేతమై ఆస్త్మా లక్షణాలతో బాధపడేవారికి ఆయా ఇబ్బందులను నివారిస్తుంది. స్విమ్మింగ్‌తో చురుకుదనం సాధ్యమై ఒత్తిడి, కుంగుబాటు మటుమాయమవుతాయి. మూడ్‌ను మెరుగుపరిచి ఉత్సాహం, ఉత్తేజం పెంపొందిస్తుంది. రోజూ స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేయడం ద్వారా రక్త ప్రసరణ మెరుగవడంతో పాటు నిద్ర లేమి సమస్యలను నివారిస్తుంది.