మారుతున్న జీవనశైలి, బతుకు పోరాటంలో ఎంతోమంది విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వివిధ సమస్యలతో సతమతమవుతున్నారు. దానివల్ల వాళ్లలో ఒత్తిడి కలిగించే కార్టిసాల్ హార్మోన్ విడుదలవుతున్నది. ఇది అధిక బరువు, ఆందోళన, అలసట లాంటి సమస్యలకు కారణమవుతున్నది. అందువల్ల రోజువారీ ఆహారంలో ఈ కార్టిసాల్ హార్మోన్ స్థాయులను తగ్గించే పదార్థాలను తీసుకోవాలి.
మెగ్నీషియం: శరీరంలో మెగ్నీషియం స్థాయులు తగ్గినప్పుడు, కార్టిసాల్ పెరుగుతుంది. దీనివల్ల నాడీ వ్యవస్థ పనితీరులో సమస్యలు వస్తాయి. అందుకే మెగ్నీషియం ఎక్కువగా ఉండే గింజలు, విత్తనాలు, చిక్కుళ్లు, ఆకుకూరలు, అరటిపండ్లు, అవకాడో, చేపలను ఆహారంలో చేర్చుకోవాలి.
విటమిన్-సి: కార్టిసాల్ ఉత్పత్తిని నియంత్రించే అడ్రినల్ గ్రంథి పనితీరుకు విటమిన్-సి బాగా ఉపయోగపడుతుంది. దీర్ఘకాల ఒత్తిడికి కారణమయ్యే ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను విటమిన్-సి తటస్థీకరిస్తుంది. అందుకే విటమిన్-సి అధికంగా ఉండే నారింజ, నిమ్మ, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, కివి, బ్రకోలీ, క్యాప్సికమ్, టమాటా, క్యాబేజీ వంటి పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలి.
ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు: ఇవి శరీరంలోని ఇన్ఫ్లమేషన్, కార్టిసాల్ స్థాయులను తగ్గిస్తాయి. ఒమేగా-3 ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే మానసిక, శారీరక ఆరోగ్యం బాగుంటుంది. చేపలు, వాల్నట్స్, అవిసె గింజలను తరచూ తీసుకోవాలి. వీటితోపాటు అవసరాన్ని బట్టి డాక్టర్‌ను సంప్రదించి ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లు కూడా వాడొచ్చు.
బివిటమిన్ (బీ5, బీ6, బీ12): శరీరంలో శక్తికైనా, అడ్రినల్ ఆరోగ్యానికైనా విటమిన్-బి చాలా ముఖ్యం. అయితే విటమిన్- బీ5, బీ6, బీ12 మానసిక ఆరోగ్యం, నాడీ వ్యవస్థ పనితీరులో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి శరీరంలో లోపించినప్పుడు కార్టిసాల్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇలాంటప్పుడు ఆహారంలో తృణధాన్యాలు, గుడ్లు, చిక్కుళ్లు తీసుకోవాలి. ఇవి హార్మోన్ల అసమతుల్యతకు మంచి పరిష్కారంగా పని చేస్తాయి.
ఫాస్ఫాటిడైల్సెరిన్: ఈ న్యూట్రియెంట్ మెదడు ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే శరీరంలో కార్టిసాల్ స్థాయులను తగ్గిస్తుంది. ఇది సోయాబీన్స్, చేపలు వంటి వాటిలో ఉంటుంది. అయితే ఫాస్ఫాటిడైల్సెరిన్ అనే పోషకం మనం రోజువారీగా తీసుకునే ఆహారంలో తక్కువగా ఉంటుంది. కాబట్టి డాక్టర్‌ను సంప్రదించి సప్లిమెంట్స్ తీసుకుంటే మంచిది.