Foods For Diabetics | డయాబెటిస్ తో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుందనే చెప్పవచ్చు. మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పుల కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరినీ ఈ సమస్య ఇబ్బంది పెడుతుంది. డయాబెటిస్ తో బాధపడే వారు మందులు వాడడంతో పాటు తీసుకునే ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తలు వహించాలి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే ఆహారాలతో పాటు శరీరానికి పోషకాలను, శక్తిని అందించే ఆహారాలను కూడా తీసుకోవాలి. ఇలా సరైన ఆహారాలను తీసుకున్నప్పుడే డయాబెటిస్ తో బాధపడే వారిలో పోషకాహార లోపం తలెత్తకుండా ఉంటుంది. డయాబెటిస్ తో బాధపడే వారికి శరీరానికి శక్తిని అందించడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించే ఉత్తమ ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
డయాబెటిస్ వ్యాధి గ్రస్తులు ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి. పాలకూర, కాలే, మెంతి ఆకు వంటి వాటిలో క్యాలరీలు, కార్బొహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. అలాగే బ్రౌన్ రైస్, ఓట్స్, చిరుధాన్యాలను తీసుకోవాలి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల నెమ్మదిగా జీర్ణమవుతాయి. కడుపు నిండిన భావన కలుగుతుంది. వీటిని తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిల్లో వచ్చే ఆకస్మిక పెరుగుదలను నివారించవచ్చు. కాయధాన్యాల్లో ఫైబర్ తో పాటు ప్రోటీన్ ఉంటుంది. ఇవి చక్కెర శోషణ నెమ్మదిగా జరిగేలా చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు స్థిరంగా ఉంటాయి.
డయాబెటిస్ రోగులకు గింజలు, విత్తనాలు కూడా ఎంతో మేలు చేస్తాయి. బాదం, వాల్నట్స్, అవిసె గింజలు, చియా విత్తనాలు ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. అదే విధంగా స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్బెర్రీ వంటి పండ్లల్లో ఇతర పండ్లల్లో కంటే చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కనుక డయాబెటిస్ తో బాధపడే వారు ఈ పండ్లను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. డయాబెటిస్ తో బాధపడే వారు సాల్మన్, సార్డిన్స్, మాకేరెల్ వంటి చేపలను తీసుకునే ప్రయత్నం చేయాలి. వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి డయాబెటిస్ ను అదుపులో ఉంచడంతో పాటు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
పెరుగును తీసుకోవడం వల్ల పేగుల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా స్థిరంగా ఉంటాయి. బీన్స్, శనగలు వంటి వాటిని కూడా ఆహారంలో భాగంగా చేసుకోవాలి. వీటిలో ఫైబర్ తో పాటు ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ అందడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. డయాబెటిస్ తో బాధపడే వారు తరచూ నీరసం, అలసట వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల శక్తి స్థాయిలు స్థిరంగా ఉండడంతో పాటు డయాబెటిస్ కూడా అదుపులో ఉంటుంది.