Health Tips | కోటి విద్యలూ కూటి కోసమే అని సామెత. కానీ, ఆధునిక వృత్తి నిపుణులు భోజనాన్ని దాటవేయడం సాధారణంగా జరుగుతుండే విషయమే. కొన్నిరోజుల వరకు ఇది అంతగా ఇబ్బంది అనిపించకపోవచ్చు. కానీ, పొట్టను పస్తులు ఉంచడం దీర్ఘకాలంలో గుండెకు హాని కలిగిస్తుందని అంటున్నారు వైద్యులు. భోజనం వాయిదా వేస్తే రక్తంలో చక్కెర స్థాయులు తగ్గిపోతాయి. దీంతో ఇరిటేషన్, ఆందోళన, ఒత్తిడి లాంటి అనుభూతులు కలుగుతాయి. దీర్ఘకాలిక ఒత్తిడి అధిక రక్తపోటుకు దారితీస్తుంది. ఇది గుండెజబ్బులకు ప్రధాన కారణంగా నిలుస్తుంది. అంతేకాదు సమయానికి తినకపోవడం మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది.
భోజనం వాయిదా వేయడం వల్ల తర్వాత పరిమితికి మించి తినేస్తాం. అంతేకాదు అనారోగ్యకరమైన క్యాలరీలు ఎక్కువగా ఉండే ప్రాసెస్డ్ ఆహార పదార్థాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు పెరగడానికి, అధిక కొలెస్ట్రాల్‌కు, రక్తనాళాల్లో అవరోధాలకు కారణమవుతుంది. ఇవన్నీ కూడా గుండెజబ్బుల ముప్పును పెంచుతాయి.
వేళకు తినకపోతే శరీరంలో జీవక్రియలు నెమ్మదిస్తాయి. ఇది శరీరంలో కొవ్వు పేరుకోవడానికి దారితీస్తుంది. దీంతో ఊబకాయం ముప్పు, తద్వారా గుండె మీద ఒత్తిడీ పెరుగుతాయి.
భోజనం మానేస్తే శరీరంలో రక్తంలో చక్కెర (గ్లూకోజ్) స్థాయులు అకస్మాత్తుగా పడిపోతాయి. దీంతో తల తిరిగినట్టుగా, అశక్తతగా అనిపిస్తుంది. ఇది గుండె రక్తనాళాల ఆరోగ్యానికి చేటు చేస్తుంది. రక్తపోటు లయ తప్పుతుంది.
దీర్ఘకాలంపాటు తిండిని వాయిదా వేయటం వల్ల శరీరంలో ఇన్సులిన్ క్రమబద్ధంగా ఉత్పత్తి కాదు. దీంతో టైప్ 2 డయాబెటిస్ అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. ఇది కూడా గుండె ఆరోగ్యానికి సమస్యగా మారుతుంది.
పనిచేసే రోజుల్లో ఆహారానికి ఓ ప్రణాళిక వేసుకోవాలి. ముందే సిద్ధం చేసుకుంటే సమయానికి తింటారు. పండ్లు, గింజలు, యోగర్ట్ లాంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను సిద్ధంగా ఉంచుకోవాలి.
ఆహారంలో తేలిగ్గా అరిగే ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, హోల్ గ్రెయిన్స్, కూరగాయలు తగినపాళ్లలో ఉండాలి. దీనివల్ల శరీరానికి శక్తి స్థిరంగా లభిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయులు కూడా అదుపులో ఉంటాయి.
ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్ఫోన్లు, వాచ్‌లు ఉంటున్నాయి. అలారం పెట్టుకుంటే తిండిని వాయిదా వేసే అవకాశమే ఉండదు.
కొన్నిసార్లు దప్పికగా అనిపించడాన్ని కూడా ఆకలిగా పొరబడే అవకాశం ఉంది. కాబట్టి రోజంతా తగినన్ని నీళ్లు తాగుతూ ఉండాలి. దీంతో అనవసరంగా ఏదో ఒకటి తినే పరిస్థితి తలెత్తదు.
మీ పనికి కాసేపు విరామం ఇచ్చి సమయానికి తినేయాలి. ఇలా చేస్తే జీర్ణవ్యవస్థ పనితీరు కూడా సక్రమంగా ఉంటుంది.
అందువల్ల… తిండిని వాయిదా వేసుకోవడాన్ని సమయాన్ని ఆదా చేసుకుంటున్నట్టుగా భావించకండి. ఎంత పనిలో ఉన్నప్పటికీ ఆహారం విషయంలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కెరీర్లో విజయాలూ సొంతం చేసుకోవచ్చు.