Constipation | ప్రస్తుతం చాలా మంది మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవకపోవడం, మసాలాలు, నాన్ వెజ్ అధికంగా తినడం, ఫైబర్ లేని ఆహారాలను అధికంగా తినడం, డయాబెటిస్, థైరాయిడ్ వంటి సమస్యలు ఉండడం, పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడం, మెడిసిన్లను వాడడం వంటి కారణాల వల్ల చాలా మందికి మలబద్దకం వస్తోంది. దీని నుంచి ఎలా బయట పడాలో తెలియక చాలా మంది అవస్థ పడుతున్నారు. అయితే మలబద్దకం సమస్యను నిర్లక్ష్యం చేస్తే అది పైల్స్‌కు దారి తీస్తుంది. కనుక ఈ సమస్య ఉన్నవారు దాన్నుంచి బయట పడే ప్రయత్నం చేయాలి. అందుకు గాను కొన్ని చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. మలబద్దకం ఉన్నవారు మెడిసిన్లను వాడాల్సిన పనిలేకుండా కొన్ని సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తే ఆ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. ఇక ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజూ ఉదయం పరగడుపునే 1 టీస్పూన్ ఆలివ్ ఆయిల్‌ను సేవిస్తుండాలి. దీంతో పేగుల్లో మలం కదలికలు సులభతరం అవుతాయి. మలబద్దకం తగ్గుతుంది. సుఖ విరేచనం అవుతుంది. ఆలివ్ ఆయిల్ లాగే నెయ్యి కూడా బాగానే పనిచేస్తుంది. దీన్ని ముందు రోజు రాత్రి కాస్త వేడి చేసి ఒక టీస్పూన్ మోతాదులో తాగవచ్చు. లేదా ఉదయం పరగడుపునే కూడా సేవించవచ్చు. దీంతోనూ మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. రాత్రిపూట నిద్రకు ముందు ఒక టీస్పూన్ కొబ్బరినూనె లేదా ఆముదాన్ని కాస్త వేడి చేసి తాగుతున్నా కూడా ఉపయోగం ఉంటుంది. మలబద్దకాన్ని తగ్గించేందుకు ఈ చిట్కాలు కూడా అద్భుతంగానే పనిచేస్తాయి. అలాగే రాత్రి పూట ఆహారంలో పెరుగు లేదా మజ్జిగను తీసుకోవాలి. ఇవి ప్రో బయోటిక్ ఆహారాలు. జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేలా చేస్తాయి. దీంతో జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా మలబద్దకం నుంచి బయట పడవచ్చు.
ఉదయం పరగడుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగుతున్నా కూడా మలబద్దకం తగ్గుతుంది. ఈ మిశ్రమం జీర్ణ వ్యవస్థను శుభ్రంగా మారుస్తుంది. పేగుల్లో ఉండే వ్యర్థాలను బయటకు పంపుతుంది. దీంతో సమస్య తగ్గిపోతుంది. అలాగే రాత్రిపూట పాలలో కొద్దిగా మిరియాల పొడిని కలిపి తాగుతున్నా కూడా ఉపయోగం ఉంటుంది. రాత్రి పూట భోజనం చేసిన అనంతరం లేదా నిద్రకు ముందు ఒక కప్పు బొప్పాయి పండు ముక్కలను తినాలి. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలకు బొప్పాయి పండు ఔషధంగా పనిచేస్తుంది. మునగాకులను రోజువారి ఆహారంలో భాగం చేసుకున్నా ఉపయోగం ఉంటుంది. మునగాకులను కూరగా, పప్పుగా చేసుకుని తినవచ్చు. లేదా ఈ ఆకులను ఎండబెట్టి పొడి చేసి దాన్ని రోజూ మీరు తినే ఆహారాల్లో కలిపి తీసుకోవచ్చు. దీంతోనూ జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఓట్మీల్, బీన్స్, యాపిల్స్, క్యారెట్లు, బార్లీ, తృణ ధాన్యాలు, నట్స్, ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు, కివిలు, పాలకూర, మొలకలు, శనగలు, పప్పు దినుసులు, చియా విత్తనాలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకం తగ్గేలా చేస్తుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజూ తగినన్ని నీళ్లను తాగకపోవడం వల్ల కూడా మలబద్దకం ఏర్పడుతుంది. కనుక రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లను అయినా తాగాల్సి ఉంటుంది. దీని వల్ల పేగుల్లో ఆహారం కదలికలు సరిగ్గా ఉంటాయి. మలబద్దకం తగ్గిపోతుంది. అలాగే రోజూ గోరు వెచ్చని నీళ్లను తాగుతున్నా కూడా ఉపయోగం ఉంటుంది. యాపిల్ జ్యూస్, సూప్‌లు, కొబ్బరి నీళ్లను తాగుతున్నా కూడా మలబద్దకం నుంచి బయట పడవచ్చు. ఇలా పలు చిట్కాలను పాటిస్తే సులభంగా మలబద్దకం తగ్గిపోతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.