న్యూఢిల్లీ : వాయు కాలుష్యం ఊపిరితిత్తుల పనితీరును దెబ్బతీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాయు కాలుష్యంతో శ్వాసకోశ సమస్యలు, గుండె జబ్బులు, ఆస్త్మా, సీఓపీడీ వంటి పలు వ్యాధులు వెంటాడతాయని, శీతాకాలం రాబోతున్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్, ఢిల్లీ పల్మనాలజీ కన్సల్టెంట్ డాక్టర్ అవి కుమార్ అప్రమత్తం చేశారు. పొగ, వాయు కాలుష్యం కలిసి ప్రజల ఊపిరితిత్తులపై పెను ప్రభావం చూపుతాయని ఈ పరిస్ధితులు న్యుమోనియాకు దారితీస్తాయని, పిల్లలు, వృద్ధులపై ప్రభావం అధికంగా ఉంటుందని ఫోర్టిస్ హాస్పిటల్ పల్మనాలజీ విభాగాధిపతి డాక్టర్ వికాస్ మౌర్య చెప్పుకొచ్చారు.
ఇక వాయు కాలుష్యం నుంచి ఊపిరితిత్తులను కాపాడుకోవాలంటే ధూమపానం చేసే వారికి దూరంగా ఉండాలని, ఇండోర్ పొల్యూషన్‌ను నివారించేందుకు ధూమపానం చేసేవారు ఇండ్ల వెలుపల స్మోకింగ్ జోన్స్‌ను ఎంచుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వాయు కాలుష్యం తీవ్రతకు గురికాకుండా ఉండేందుకు ఉదయం, రాత్రి వేళల్లో వ్యాయామం చేయరాదని, ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల్లోపు ఎక్సర్సైజ్ చేయడం మేలని చెబుతున్నారు.
ఎన్95 పొల్యూషన్ మాస్క్ లేదా వాల్వ్ ఉన్న మాస్క్ ధరించాలని, సిట్రస్ పండ్లు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా లంగ్స్ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఇండ్లలో అగర్బత్తీలు, మస్కిటో కాయిల్స్ వాడరాదని, ఎయిర్ ఫ్యూరిఫైర్ వాడాలి. సహజమైన ఎయిర్ క్లీన్సర్ అయిన ఇవీ, స్పైడర్, స్నేక్ ప్లాంట్స్ వంటి ఇండోర్ ప్లాంట్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి.