Type 2 Diabetes | ప్రపంచ వ్యాప్తంగా ఏటా కొన్ని కోట్ల మంది కొత్తగా డయాబెటిస్ బారిన పడుతున్నారు. డయాబెటిస్‌కు ప్రపంచానికి రాజధానిగా భారత్‌ను చెబుతుంటారు. ఎందుకంటే డయాబెటిస్ వ్యాధి గ్రస్తుల సంఖ్య మన దేశంలో పెరుగుతున్నట్లు ఏ దేశంలోనూ పెరగడం లేదు. గతంలో 50 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే షుగర్ వచ్చేది. కానీ ఇప్పుడు 20 ఏళ్ల వయస్సులో ఉన్నవారు కూడా డయాబెటిస్తో బాధపడుతున్నారు. వంశ పారంపర్యంగా వచ్చే టైప్ 1 డయాబెటిస్‌తోపాటు జీవన విధానం అస్తవ్యవస్తంగా మారడం వల్ల వచ్చే టైప్ 2 డయాబెటిస్ బాధితుల సంఖ్య కూడా మన దేశంలో విపరీతంగా పెరుగుతోంది. ఇది వైద్య నిపుణులను ఆందోళనకు గురి చేస్తోంది. అయితే టైప్ 2 డయాబెటిస్ వచ్చిన వారు డాక్టర్ ఇచ్చే మందులతోపాటు పలు ఇంటి చిట్కాలను పాటించడం వల్ల షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయవచ్చు.
అధ్యయనాలు చెబుతున్న ప్రకారం షుగర్ లెవల్స్‌ను తగ్గించేందుకు దాల్చిన చెక్క ఎంతగానో పనిచేస్తుంది. దాల్చిన చెక్కను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను రోజూ రెండు పూటలా ఉదయం, సాయంత్రం ఒక కప్పు మోతాదులో తాగుతుండాలి. దీంతో ఇన్సులిన్‌ను శరీరం సమర్థవంతంగా గ్రహిస్తుంది. దీని వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది. దాల్చిన చెక్క నీళ్లను తాగలేకపోతే మీరు రోజూ తినే ఆహారాలపై కాస్త దాల్చిన చెక్క పొడిని చల్లి తినవచ్చు. అలాగే మెంతులు కూడా షుగర్ లెవల్స్‌ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. రాత్రిపూట కొన్ని మెంతులను నీటిలో నానబెట్టి వాటిని మరుసటి రోజు ఉదయం పరగడుపునే తినాలి. ఇలా చేస్తున్నా కూడా డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
చేదుగా ఉంటాయని చెప్పి కాకరకాయలను తినేందుకు చాలా మంది అయిష్టతను చూపిస్తుంటారు. కానీ షుగర్ ఉన్నవారు కచ్చితంగా వీటిని తినాలి. ముఖ్యంగా కాకరకాయ జ్యూస్‌ను రోజూ ఉదయం పరగడుపున 30 ఎంఎల్ మోతాదులో తాగుతుంటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్‌ను అదుపు చేసేందుకు కలబంద కూడా పనిచేస్తుంది. కలబంద రసాన్ని రోజూ పరగడుపునే సేవిస్తున్నా కూడా షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. ఇన్సులిన్ నిరోధకతను తగ్గించి షుగర్ ను అదుపు చేయడంలో యాపిల్ సైడర్ వెనిగర్ కూడా పనిచేస్తుంది. రాత్రి పూట నిద్రకు ముందు దీన్ని పావు టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో కలిపి తాగుతుండాలి. ఆయుర్వేదంలో పలు రకాల మూలికలను వాడుతున్నా కూడా షుగర్‌ను అదుపు చేయవచ్చు.
మేశ శృంగి (పొడపత్రి) అనే ఆకు చూర్ణాన్ని వాడుతున్నా కూడా షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. అలాగే బర్బెరిన్ అనే మూలిక కూడా పనిచేస్తుంది. అయితే డయాబెటిస్ వచ్చిన వారు ఎట్టి పరిస్థితిలోనూ మందులను మానేయకూడదు. ఈ చిట్కాలను పాటిస్తూనే షుగర్ ను క్రమంగా తగ్గించుకోవాలి. దీంతో మీ షుగర్ లెవల్స్‌ను చూసి డాక్టర్ స్వయంగా మందుల డోసు తగ్గిస్తారు. ఇలా కొంత కాలానికి మీరు డయాబెటిస్ నుంచి పూర్తిగా బయట పడవచ్చు. అలాగే రోజూ తగినన్ని గంటలపాటు నిద్రించడం, కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం, వేళకు భోజనం చేయడం, ఫైబర్ ఉండే ఆహారాలను తినడం, బరువును నియంత్రణలో ఉంచుకోవడం చేస్తుండాలి. ఇవన్నీ షుగర్ ను తగ్గించి ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించేలా చేస్తాయి.