Cold | నిన్న మొన్నటి వరకు మాడు బద్దలు అయ్యే విధంగా ఎండలు విజృంభించాయి. రుతు పవనాల రాకతో వాతావరణం కాస్త చల్లబడింది. ఒక్కసారిగా సీజన్ మారింది. దీంతో చాలా మందికి సీజనల్ వ్యాధులు వచ్చేశాయి. ముఖ్యంగా జలుబు చాలా మందిని ఇబ్బంది పెడుతోంది. ఉన్నట్లుండి వాతావరణం వేడి నుంచి చల్లగా మారేసరికి శరీరం దానికి తగినట్లు సర్దుకోవాల్సి ఉంటుంది. అందుకనే చాలా మందికి జలుబు చేస్తుంది. అయితే జలుబు చేస్తే అందుకు ఇంగ్లిష్ మెడిసిన్ వాడాల్సిన పనిలేదు. మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే చాలా సహజసిద్ధంగా జలుబును తగ్గించుకోవచ్చు. అందుకు కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. ఈ చిట్కాలను పాటిస్తే జలుబు తగ్గుతుంది. గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే కఫం కరిగిపోతుంది. ఇక ఆ చిట్కాలు ఏమిటంటే..
జలుబు చేసిన వారు నీళ్లను అధికంగా తాగాల్సి ఉంటుంది. దీంతో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. అలాగే జలుబు త్వరగా తగ్గే అవకాశాలు ఉంటాయి. అలాగే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి రోజుకు 3 సార్లు తాగుతుండాలి. నిమ్మరసంలో ఉండే విటమిన్ సితోపాటు తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు జలుబుకు కారణం అయ్యే వైరస్‌లను నాశనం చేస్తాయి. దీంతో జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే కఫం కూడా కరిగి బయటకు వస్తుంది. అదేవిధంగా చిన్న అల్లం ముక్కను నీటిలో వేసి మరిగించి అనంతరం ఆ నీటిలో కాస్త తేనె కలిపి రోజుకు 3 పూటలా తాగవచ్చు. అల్లంలో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ వైరల్ గుణాలు జలుబును తగ్గిస్తాయి.
ఆయుర్వేదలో తులసి ఆకులకు ఎంతగానో ప్రాధాన్యతను కల్పించారు. ఈ ఆకులు రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. దీంతో శరీరం రోగాలు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. తులసి ఆకుల్లో యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఇవి జలుబును తగ్గిస్తాయి. తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లలో కాస్త మిరియాల పొడి కలిపి రోజుకు 3 సార్లు తాగుతుంటే జలుబు నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది. దాల్చిన చెక్కలో ఉండే యాంటీ వైరల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు జలుబును త్వరగా తగ్గిస్తాయి. దాల్చిన చెక్క లేదా దాని పొడిని కాస్త తీసుకుని నీటిలో వేసి మరిగించి తాగుతుంటే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.
అతి మధురం జలుబును తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. దీని వేరును కొద్దిగా తీసుకుని నీటిలో వేసి మరిగించి తాగుతుంటే జలుబు త్వరగా నయం అవుతుంది. కఫం కరిగి శ్వాస సరిగ్గా ఆడుతుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. రాత్రి పూట పాలలో పసుపు కలిపి తాగుతున్నా కూడా జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. పసుపులో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ వైరల్ గుణాలు జలుబును తగ్గిస్తాయి. చికెన్ లేదా వెజటబుల్ సూప్‌ను రోజుకు 2 సార్లు తాగుతున్నా కూడా కఫం కరిగిపోతుంది. శ్వాస నాళాలు క్లియర్ అవుతాయి. ముక్కు దిబ్బడ, జలుబు తగ్గిపోతాయి. అలాగే నీళ్లను బాగా మరిగించి అందులో కాస్త యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి పడుతుండాలి. పూటకు ఒకసారి ఇలా చేస్తున్నా కూడా జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా పలు ఇంటి చిట్కాలను పాటిస్తే జలుబు నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.