Acidity | గ్యాస్, అసిడిటీ వంటి జీర్ణ సమస్యలు మనల్ని అప్పుడప్పుడు ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంటాయి. జీర్ణాశయంలో ఆమ్లాలు మోతాదు కన్నా మించి ఎక్కువగా ఉత్పత్తి అయితే అప్పుడు పొట్టలో ఆమ్లత్వం ఏర్పడుతుంది. దీంతో కడుపులో మంటగా అనిపిస్తుంది. అలాగే కొందరికి గ్యాస్ కూడా వస్తుంది. దీన్నే అసిడిటీ అంటారు. కొందరికి గుండెల్లో మంటగా కూడా ఉంటుంది. దీన్ని హార్ట్ బర్న్ అంటారు. ఇవన్నీ ఒకే సమస్య వల్ల వస్తుంటాయి. దీంతోపాటు ఛాతి, మెడ భాగాల్లో కొందరికి నొప్పిగా కూడా ఉంటుంది. అయితే గ్యాస్ లేదా అసిడిటీ సమస్య వచ్చేందుకు పలు కారణాలు ఉంటాయి. కొవ్వు పదార్థాలను, కారం, మసాలాలు ఉన్న ఆహారాలను అధికంగా తినడం వల్ల, ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉండడం, వేళకు భోజనం చేయకపోవడం, శీతల పానీయాలను లేదా టీ, కాఫీలను అధికంగా సేవించడం, రాత్రి పూట సరిగ్గా నిద్రించకపోవడం, పలు రకాల మందులను వాడడం వల్ల కూడా అసిడిటీ వస్తుంది. అయితే మన ఇంట్లో ఉండే పలు పదార్థాలతోనే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. అందుకు పలు చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
అసిడిటీ సమస్య తగ్గేందుకు బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుంది. బేకింగ్ లేదా వంట సోడా ఆల్కలైన్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. కనుక పొట్టలోని ఆమ్లాలు తటస్థం అవుతాయి. దీంతో అసిడిటీ తగ్గిపోతుంది. ఒక గ్లాస్లో ఒక టీస్పూన్ బేకింగ్ సోడాను కలుపుకుని తాగితే అసిడిటీ వెంటనే తగ్గుతుంది. అయితే లవణాలు ఎక్కువగా ఉంటాయి కనుక హైబీపీ ఉన్నవారు దీన్ని ఉపయోగించరాదు. ఇక జీలకర్ర కూడా అజీర్ణ సమస్యను పరిష్కరిస్తుంది. ఒక టీస్పూన్ జీలకర్ర పొడిని నీటిలో కలుపుకుని తాగితే తక్షణమే అసిడిటీ తగ్గుతుంది. అలాగే హైబీపీ తగ్గుతుంది. జీర్ణాశయంలో అల్సర్లు రాకుండా ఉంటాయి. అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు అసిడిటీని తగ్గిస్తాయి. కొద్దిగా అల్లం రసంను సేవించినా లేదా ఒక పాత్రలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని అందులో చిన్న అల్లం ముక్క వేసి బాగా మరిగించి ఆ తరువాత వచ్చే నీటిని తాగినా, అల్లం రసంను ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా కలుపుకుని తాగినా అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది.
అల్సర్లను తగ్గించే శక్తి తులసి ఆకులకు ఉంటుంది. తులసి ఆకులను నిత్యం నమిలి తినడం వల్ల అసిడిటీ ఉండదు. జీర్ణాశయ గోడలను సంరక్షించే గుణాలు తులసిలో ఉంటాయి. అందువల్ల అల్సర్లు రావు. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. పసుపులో కర్క్యుమిన్ అనబడే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటుంది. అందువల్ల అసిడిటీ తగ్గుతుంది. చిటికెడు పసుపును ఒక గ్లాస్ నీటిలో కలుపుకుని తాగితే ఫలితం ఉంటుంది. దీంతోపాటు అల్సర్లు కూడా తగ్గుతాయి. ఇక అసిడిటీ సమస్యను తగ్గించేందుకు సోంపు గింజలు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. భోజనం చేసిన తరువాత గుప్పెడు సోంపు గింజలను నోట్లో వేసుకుని నమిలి తినాలి. ఇలా తగ్గే వరకు చేయాల్సి ఉంటుంది. అలాగే అరటి పండ్లను తింటున్నా ఉపయోగం ఉంటుంది. అరటి పండ్లలో సహజసిద్ధమైన అంటాసిడ్ గుణాలు ఉంటాయి. కనుక ఈ పండ్లను తింటుంటే కడుపులో మంట తగ్గిపోతుంది. గ్యాస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
ఒక గ్లాస్ మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పొడి లేదా కరివేపాకుల పొడి లేదా పుదీనా ఆకుల రసాన్ని కలిపి కూడా తాగవచ్చు. ఇవన్నీ అసిడిటీ సమస్యకు ఔషధాలుగా పనిచేస్తాయి. జీర్ణ వ్యవస్థను రక్షిస్తాయి. ఇక అసిడిటీ సమస్య ఉన్నవారు కొద్ది రోజుల వరకు తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారాలను తినాలి. కొవ్వు పదార్థాలు, కారం, మసాలా ఆహారాల జోలికి వెళ్లకూడదు. మద్యం సేవించకూడదు. పొగ తాగకూడదు. వేళకు భోజనం చేయాలి. జంక్ ఫుడ్ తినకూడదు. పచ్చళ్లకు దూరంగా ఉండాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తింటుండాలి. ఇలా ఆయా చిట్కాలను, జాగ్రత్తలను పాటిస్తుంటే అసిడిటీ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. జీర్ణ వ్యవస్థ సైతం ఆరోగ్యంగా ఉంటుంది.