Health Tips | ఎంత డబ్బు ఉన్నప్పటికీ, ఎంత ధనం సంపాదించినా ఆరోగ్యం సరిగ్గా లేకపోతే వృథాయే. అందుకనే మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం కొన్ని సూత్రాలను పాటించాల్సి ఉంటుంది. ప్రస్తుత బిజీ యుగంలో చాలా మంది సరైన జీవనశైలిని పాటించడం లేదు. అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం, ఆలస్యంగా భోజనం చేయడం, జంక్ ఫుడ్ లేదా బయటి తిండి ఎక్కువగా తినడం చేస్తున్నారు. ఇవన్నీ రోగాలకు కారణమవుతున్నాయి. అయితే వైద్యులు చెబుతున్న ప్రకారం కొన్ని సూత్రాలను పాటించడం వల్ల ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి రోగాలు రాకుండా 100 ఏళ్ల వరకు జీవించవచ్చు. అందుకు గాను ప్రతి ఒక్కరూ పాటించాల్సిన సూత్రాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది రోజుకు ఒకటి లేదా రెండు సార్లు అతి ఎక్కువగా భోజనం చేస్తుంటారు. అలా చేయకూడదు. ఎక్కువ సార్లు తిన్నా సరే కొంచెం కొంచెం తినాలి. దీని వల్ల జీర్ణవ్యవస్థపై భారం పడకుండా ఉంటుంది. జీర్ణ సమస్యలు తలెత్తవు. ముఖ్యంగా తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. శరీరంలో కొవ్వు చేరకుండా చూసుకోవచ్చు. ఇక భోజనం చేసిన ప్రతిసారి అందులో కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. వీటి ద్వారా ఫైబర్ అధిక మొత్తంలో లభిస్తుంది. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అలాగే ఆహారంలో పెసలు, శనగలు వంటి ఆహారాలను చేర్చుకోవాలి. వీటిల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి కండరాలకు శక్తిని అందిస్తాయి. మనల్ని రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. ఇక ఆహారంలో పెరుగు లేదా మజ్జిగన కచ్చితంగా తీసుకోవాలి. ఇవి జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియా తయారయ్యేలా చేస్తాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. అలాగే క్యాల్షియం ఉంటుంది కనుక ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.
మీరు రోజూ తినే ఆహారంలో కచ్చితంగా ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. మనం తిన్న తరువాత ఆహారం సరిగ్గా జీర్ణం అవకపోతే అది కొవ్వుగా మారుతుంది. కానీ ఫైబర్ ఉన్న ఆహారాలను తింటే ఇలా జరగదు. ఆహారం పూర్తిగా జీర్ణమవుతుంది. దీంతో మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకోవడమే కాదు, కొవ్వు చేరకుండా ఉంటుంది. ఫలితంగా అధిక బరువు తగ్గుతారు. బరువు నియంత్రణలో ఉంటుంది. కాబట్టి ఆహారంలో ఫైబర్ ఉండేలా చూసుకోండి. ఇక ఆహారంలో కొవ్వు పదార్థాలను కూడా తీసుకోవాలి. కానీ తక్కువ పరిమాణంలో తినాలి. ఇవి మనకు ఎక్కువగా అవసరం ఉండవు. కనుక కొవ్వు పదార్థాలను మరీ అతిగా తినకూడదు. 100 ఏళ్ల పాటు ఆరోగ్యంగా జీవించాలంటే కొవ్వు పదార్థాలను తినడం తగ్గించాలి.
ఇక మాంసాహారం తినేవారు చేపలను ఎక్కువగా తినాలి. చికెన్, మటన్ తినడం కాస్త తగ్గించాలి. చేపల్లో మన శరీరానికి ఉపయోగపడే ఆరోగ్యకరమైన ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి. కంటి చూపును మెరుగు పరుస్తాయి. శరీరంలోని ఎల్డీఎల్ (చెడు కొలెస్ట్రాల్)ను తగ్గించి హెచ్‌డీఎల్ (మంచి కొలెస్ట్రాల్)ను పెంచుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఆహారంలో చేపలను చేర్చుకోండి. అలాగే మీరు తినే ఆహారంలో చక్కెర, ఉప్పు అతిగా ఉండకుండా చూసుకోండి. ఇవి బీపీ, షుగర్లకు కారణమవుతాయి. కనుక వీటిని ఎంత తక్కువ తింటే అంత మంచిది. లేదా పూర్తిగా మానేస్తే ఇంకా మంచిది. అలాగే రోజూ కనీసం 30 నిమిషాల పాటు అయినా సరే వ్యాయామం చేయాలి. తేలికపాటి నడక చాలు. దీంతో శరీరం ఫిట్‌గా ఉంటుంది. ఎల్లప్పుడూ శక్తి స్థాయిలు తగ్గవు. ఆరోగ్యంగా ఉంటారు. ఇలా పలు రకాల సూత్రాలను పాటిస్తే 100 ఏళ్ల పాటు ఎలాంటి రోగాలు రాకుండా జీవించవచ్చు. ఆరోగ్యంగా ఉంటారు.