Fever Foods | జ్వరం వచ్చిందంటే చాలు.. చాలా మంది ఆహారాన్ని అసలు తీసుకోరు. ఇక కొందరు అయితే తమకు నచ్చిన ఆహారాలను తింటుంటారు. డైట్‌ను పాటించరు. దీంతో జ్వరం తీవ్రత ఎక్కువవుతుంది. ఆపైన ఇబ్బందులు పడతారు. అయితే జ్వరం వచ్చిన వారు ఆహారం విషయంలో కచ్చితంగా నియమాలను పాటించాలి. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలను తినకూడదు, కేవలం కొన్ని ఆహారాలనే తినాలి. డైట్ పాటించకపోతే జ్వరం తీవ్రత పెరిగి ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక జ్వరం వచ్చిన వారు ఎట్టి పరిస్థితిలోనూ పాఉ, చీజ్, పెరుగు వంటి పాల ఉత్పత్తులను తీసుకోకూడదు. ఇవి మ్యూకస్ ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో శ్వాసకోశ వ్యవస్థపై ఒత్తిడి పడుతుంది. కనుక జ్వరం వచ్చిన వారు పాలు లేదా పాల ఉత్పత్తులకు దూరంగా ఉంటే మంచిది.
జ్వరం వచ్చినవారు ఎట్టి పరిస్థితిలోనూ తీపి పదార్థాను తినకూడదు. ముఖ్యంగా చక్కెర అధికంగా ఉండే ఆహారాలను తినకూడదు. తింటే శరీర రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా మారుతుంది. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో శరీరం వాపులకు గురవుతుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్ మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. దీంతో జ్వరం తీవ్రత కూడా పెరుగుతుంది. కాబట్టి జ్వరం ఉంటే తీపి పదార్థాల జోలికి వెళ్లకండి. కొందరు జ్వరం ఉన్నా కూడా లెక్క చేయకుండా మాంసాహారం తింటారు. కానీ అలా చేస్తే కొవ్వులు శరీరంలో అధికంగా చేరి జీర్ణవ్యవస్థపై భారం పడుతుంది. ఆహారాన్ని శరీరం సరిగ్గా జీర్ణం చేయలేదు. దీంతో అజీర్తి, గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కనుక జ్వరం వచ్చినప్పుడు మాంసాహారానికి కూడా దూరంగా ఉండండి.
ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తింటే మనకు ఎంతగానో మేలు జరుగుతుంది. అయితే జ్వరం వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి ఆహారాలను తినకూడదు. తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారాలనే తినాలి. ఫైబర్ ఉండే తృణ ధాన్యాలు, బీన్స్, ఆకుకూరలు, కూరగాయలను తింటే అవి జీర్ణం అయ్యేందుకు సమయం పడుతుంది. జీర్ణ వ్యవస్థపై భారం పడుతుంది. దీంతో సమస్య మరింత ఎక్కువవుతుంది. కనుక జ్వరం వచ్చిన వారు ఈ ఆహారాలకు కూడా దూరంగా ఉండాల్సిందే. జ్వరం వచ్చిన వారు నిమ్మజాతికి చెందిన పండ్లను తినకూడదు. వీటిల్లో విటమిన్ సితోపాటు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. జ్వరం వచ్చిన వారు తింటే గొంతులో, పొట్టలో అసౌకర్యం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. దీంతో గ్యాస్, కడుపు ఉబ్బరం వస్తాయి. కాబట్టి జ్వరం వస్తే సిట్రస్ పండ్లను కూడా తినకూడదు.
జ్వరం వచ్చిన వారు కొందరు టీ, కాఫీలను ఎడా పెడా తాగుతుంటారు. కానీ ఇలా చేస్తే వాటిల్లో ఉండే కెఫీన్ నిద్రకు భంగం కలిగిస్తుంది. దీని వల్ల జ్వరం నుంచి త్వరగా కోలుకోలేరు. కనుక జ్వరం ఉన్నవారు టీ, కాఫీలను మరీ ఎక్కువగా సేవించకూడదు. ఒక మోస్తరుగా తీసుకోవచ్చు. జ్వరం వచ్చినవారు ఎట్టి పరిస్థితిలోనూ మద్యం సేవించకూడదు. మద్యం సేవిస్తే సహజంగానే శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. శరీరంలోని ద్రవాలు వేగంగా బయటకు పోతాయి. దీనికి తోడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇవి జ్వరం ఉన్నవారికి మంచివి కావు. జ్వరం సమస్యను మరింత ఎక్కువ చేస్తాయి. కనుక జ్వరం ఉంటే మద్యం జోలికి వెళ్లకూడదు. అలాగే వేయించిన ఆహారాలు, నూనె పదార్థాలు, ప్రాసెస్ చేయబడిన ఆహారాలు వంటి వాటిని కూడా జ్వరం వచ్చిన వారు తినకూడదు. ఇవి జీర్ణ వ్యవస్థపై భారం వేస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.