Headache | నేటి వేగవంతమైన జీవనశైలిలో తలనొప్పి, అలసట, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలను చాలామంది సాధారణ విషయాలుగానే భావించి నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒత్తిడి, మైగ్రేన్, వయసు ప్రభావం లేదా నిద్రలేమి కారణంగానే ఇవి వస్తున్నాయని అనుకుని నొప్పి నివారణ ట్యాబ్లెట్లనను వేసుకుని సరిపెట్టుకుంటున్నారు. అయితే ఇలాంటి లక్షణాలు కొన్ని సందర్భాల్లో మెదడు కణితి (బ్రెయిన్ ట్యూమర్) వంటి తీవ్రమైన వ్యాధికి తొలి సంకేతాలు అయ్యే అవకాశాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెదడు కణితుల చికిత్సలో ప్రస్తుతం ఎన్నో ఆధునిక సాంకేతికతలు అందుబాటులో ఉన్నప్పటికీ, చాలా మంది రోగులు సరైన సమయంలో వైద్యులను సంప్రదించకపోవడం వల్లే చికిత్స ఆలస్యమవుతోందని నిపుణులు చెబుతున్నారు. ప్రారంభ దశలో కనిపించే లక్షణాలు సాధారణ ఆరోగ్య సమస్యలను పోలి ఉండటంతో, చాలామంది నెలల తరబడి వాటిని నిర్లక్ష్యం చేస్తుంటారు.
తలనొప్పి, తరచూ వాంతులు కావడం, చూపు మసకబారడం లేదా తగ్గిపోవడం, కారణం లేకుండా ఫిట్స్ రావడం, జ్ఞాపకశక్తి బలహీనపడటం, వ్యక్తిత్వంలో మార్పులు, నడిచేటప్పుడు సమతుల్యత కోల్పోవడం, చేతులు లేదా కాళ్లలో బలహీనత వంటి లక్షణాలు కనిపించినప్పుడు వాటిని సాధారణ సమస్యలుగా తీసుకోవద్దని సూచిస్తున్నారు. చాలామంది తలనొప్పిని ఉద్యోగ ఒత్తిడికి, జ్ఞాపకశక్తి తగ్గడాన్ని వయసు ప్రభావానికి, నడకలో తడబాటును అలసటకు ఆపాదిస్తూ ఉంటారు. ఈ విధంగా లక్షణాలకు తామే కారణాలు వెతుక్కోవడం వల్ల అసలు వ్యాధి గుర్తించడంలో ఆలస్యం జరుగుతుంది. చివరకు స్కానింగ్ పరీక్షలు చేయించే సమయానికి వ్యాధి మరింత ముదిరే అవకాశం ఉంటుంది. మెదడు కణితి అంటే ప్రాణాపాయం తప్పదనే అపోహ కూడా చాలా మందిలో ఉంటుంది. ఈ భయం వల్లే కొందరు పరీక్షలు చేయించుకోవడానికి వెనుకాడుతుంటారు. అయితే అన్ని బ్రెయిన్ ట్యూమర్లు క్యాన్సర్ కావని, చాలావరకు అవి నిరపాయమైనవే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్‌గా నిర్ధారణ అయిన సందర్భాల్లో కూడా కణితి రకం, అది ఉన్న ప్రాంతం, ఎంత త్వరగా గుర్తించారనే అంశాలపై చికిత్స ఫలితాలు ఆధారపడి ఉంటాయి.
వ్యాధిని ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్సకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి. శస్త్రచికిత్సను మరింత సురక్షితంగా, కచ్చితంగా నిర్వహించేందుకు ప్రస్తుతం న్యూరోనావిగేషన్, ఇన్ట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్, ఫ్లోరోసెన్స్ గైడెడ్ సర్జరీ, అవేక్ క్రానియోటమీ, మినిమల్లీ ఇన్వాసివ్ ఎండోస్కోపిక్ విధానాలు వంటి అత్యాధునిక సాంకేతికతలు అందుబాటులో ఉన్నాయి. అలాగే కృత్రిమ మేధ (ఏఐ) సహాయంతో శస్త్రచికిత్సకు ముందే చికిత్స ప్రణాళికను మరింత సమర్థవంతంగా రూపొందించే అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. అయితే ఎంత ఆధునిక సాంకేతికత ఉన్నా, రోగి సరైన సమయంలో వైద్యులను సంప్రదించినప్పుడే వాటి ప్రయోజనం పూర్తిగా లభిస్తుంది. అందుకే తలనొప్పి లేదా ఇతర నరాల సంబంధిత లక్షణాలు పదేపదే వస్తున్నప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం అత్యంత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజల్లో అవగాహన పెరగడం, లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించడం వల్ల మెదడు కణితుల చికిత్సలో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని వారు పేర్కొంటున్నారు.