కొందరు ఉదయం ఉత్సాహంగా నిద్రలేచినా.. మధ్యాహ్నానికే నీరుగారిపోతుంటారు. నీరసంతో తోటకూర కాడల్లా వాడిపోతారు. కునుకుపాట్లు పడుతుంటారు. ఇలాంటి పరిస్థితులు ఎదురైతే చాలామంది.. తక్షణ శక్తి కోసం చాక్లెట్లు తినడం, కాఫీ లేదా ఎన్జరీ డ్రింక్ తాగే ప్రయత్నం చేస్తుంటారు. వీటి వల్ల శక్తి వచ్చేది నిజమే కానీ, పాలపొంగులా క్షణాల్లో వచ్చిన సత్తువ కాసేపట్లోనే తగ్గిపోతుంది. మళ్లీ నీరసించిపోతారు. ఇలాంటి సమస్య రాకుండా ఉండాలంటే ఆహారపు అలవాట్లను కాస్త మార్చుకోవాలి. అందుకోసం ఈ డైట్ సూత్రాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎర్లీ బ్రేక్‌ఫాస్ట్: ఉదయం తొందరగా తినేవాళ్ల కంటే ఆలస్యంగా బ్రేక్‌ఫాస్ట్ చేసేవాళ్లలో అలసట, ఆందోళన ఎక్కువగా ఉంటాయని కొన్ని అధ్యయనాల్లో గుర్తించారు. కాబట్టి ప్రతిరోజూ ఉదయం పూట తొందరగా తినడం అలవాటు చేసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్‌లో ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను ఎంచుకోవాలి.
యోగా సాధన: యోగాసనాల వల్ల అలసట సమస్య రాదని ఎన్నో పరిశోధనలు తేల్చాయి. శ్వాసను క్రమబద్ధీకరించే ధ్యానంతోపాటు, శరీరానికి పటుత్వాన్నిచ్చే ఆసనాలు సాధన చేయడం అలవాటుగా చేసుకోవాలి.
గొంతెత్తి పాడితే: పాటలంటే చాలామందికి ఇష్టం. ఇలాంటి వాళ్లు కూనిరాగాలు తీస్తూ ఉండే బదులు గొంతెత్తి పాడితే ప్రయోజనమట. గట్టిగా పాడటం వల్ల ఉత్సాహం పెరిగినట్లే.. దేహంలో ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయని శాస్త్రీయంగా నిరూపితమైంది.
ఎనిమిది గ్లాసుల నీళ్లు: అలసటకు కారణం డీహైడ్రేషనే! మూత్ర విసర్జన సమయంలో అసౌకర్యంగా అనిపించడం, మూత్రం పసుపు రంగులో రావడం డీహైడ్రేషన్‌కు సూచికలు. ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అంటే.. తగిన మోతాదులో నీళ్లు తీసుకోవడం లేదని గ్రహించాలి. ప్రతి రోజూ కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగితే డీహైడ్రేషన్ ముప్పు ఉండదు.
ఇవి తిందాం: బాదం, పల్లీలు అప్పుడప్పుడూ తింటే అలసట అనేది తెలియదు. వీటితోపాటు దాల్చిన చెక్క, పుదీనా, మిరియాలు దేహంలో ఉత్తేజాన్ని నింపి అలసట లేకుండా చేస్తాయి.