మధ్య వయస్సువారికి అమెరికా పరిశోధకులు చేదువార్త చెప్పారు. 45నుంచి 64 ఏళ్ల వయస్సువారు ఎక్కువగా అన్నవాహిక క్యాన్సర్ బారినపడుతున్నారని తేల్చారు. వారు నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. యూఎస్‌లో ఐదు మిలియన్లకంటే ఎక్కువ మంది ఈ క్యాన్సర్‌బారిన పడుతున్నట్లు గుర్తించారు. 2012 నుంచి 2019 వరకు అన్నవాహికతో బాధపడే వారిసంఖ్య రెట్టింపు అయిందని పరిశోధకులు కనుగొన్నారు.
పరిశోధకులు ఫ్లోరిడాలోని 45-64 ఏళ్ల మధ్యవయస్సుగలవారిపై అధ్యయనం చేశారు. ఏడేళ్లలో అన్నవాహిక క్యాన్సర్ బాధితుల సంఖ్య రెట్టింపైందని తేల్చారు. ఇదే కాలంలో 50శాతం మంది అన్నవాహిక క్యాన్సర్‌కు గురయ్యే పరిస్థితుల్లో ఉన్నారని గుర్తించారు. ఈ అధ్యయనం డైజెస్టివ్ డిసీజ్ వీక్ 2022లో ప్రచురితమైంది.
అన్నవాహిక.. గొంతును కడుపుతో కలిపే పొడవైన, బోలుగా ఉండే గొట్టం. అన్నవాహిక క్యాన్సర్ అనేది అన్నవాహిక కణజాలంలో ఏర్పడే ప్రాణాంతక కణాల వల్ల ఏర్పడే ఒక వ్యాధి. ఇది ఎక్కువగా ధూమపానం, అధిక ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వస్తుంది. అకస్మాత్తుగా బరువు తగ్గడం, ఆహార పదార్థాలు మింగలేకపోవడం అన్నవాహిక క్యాన్సర్ లక్షణాలు. నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మరణాలకు ఇది ఆరో ప్రధాన కారణం. ఇది వ్యక్తి భౌగోళిక స్థితులపై ఆధారపడి ఉంటుంది. దీన్ని ఎండోస్కొపీ ద్వారా గుర్తిస్తారు. ఈ క్యాన్సర్ శరీరంలో అభివృద్ధి చెందేవరకూ ఎలాంటి సంకేతాలు కనిపించవు.