తిన్న తర్వాత ఓ వంద అడుగులు వేయాలనేది పెద్దల మాట. మనం దీన్ని చిన్న విషయంగా తేలికగా తీసుకుంటాం. కానీ తిన్న తర్వాత ఓ చిన్న నడక మన ఆరోగ్యానికి హామీ ఇస్తుంది. మన శరీరం మీద, మనసు మీద గణనీయమైన ప్రభావం చూపుతుంది. భోజనం తర్వాత నడకను అలవాటు చేసుకోవడం వల్ల రోజంతా చురుగ్గా ఉండగలుగుతాం. ఆరోగ్యకరమైన జీవితం సొంతం చేసుకుంటాం.
తిన్న తర్వాత నడవడం వల్ల తక్షణమే కలిగే ప్రయోజనం అరుగుదల సాఫీగా జరుగుతుంది. చిన్నపాటి నడక మన జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. పేగుల్లో ఆహారం సాఫీగా కదలడానికి సహకరిస్తుంది. దీంతో కడుపు ఉబ్బరం, అజీర్తి సమస్యలు తలెత్తవు. శరీరం తేలికగా
అనిపిస్తుంది.
ఆహారంలో కార్బొహైడ్రేట్ల కారణంగా తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. తిన్నాక కొంచెం సేపు నడిస్తే కండరాలు ఆహారంలోని గ్లూకోజ్‌ను ఉపయోగించుకుంటాయి. దీంతో రక్తంలో చక్కెర స్థాయులు అమాంతంగా పెరిగిపోకుండా ఉంటుంది.
ఓ పదిహేను ఇరవై నిమిషాలు నడిచినా సరే శరీరంలో ఎన్నో కొన్ని క్యాలరీలు కరిగిపోతాయి. అలా తిన్న తర్వాత కాసేపు నడవడం వల్ల ఊబకాయం ముప్పు నుంచి రక్షించుకోవచ్చు.
తిన్న తర్వాత నడక వల్ల నిద్రలో నాణ్యత కూడా పెరుగుతుంది. రాత్రి నిద్రకు ముందు తీవ్రమైన కసరత్తులు మంచివి కాదు. కానీ నడక మాత్రం ఒత్తిడిని తగ్గించే హార్మోన్లయిన కార్టిసోల్, ఎండార్ఫిన్ల విడుదలకు దోహదపడుతుంది. శరీరాన్ని విశ్రాంతి స్థితికి తీసుకువస్తుంది. పైగా తాజా గాలి పీల్చడం వల్ల శరీరం, మనసు మంచి ఉపశమనం పొందుతాయి.
తిన్న తర్వాత అనే కాదు ఎప్పుడైనా సరే నడక గుండె ఆరోగ్యానికి అండగా నిలుస్తుంది. రక్తం సాఫీగా సరఫరా అయ్యేలా చేస్తుంది. అలా బీపీ, కొలెస్ట్రాల్ స్థాయులు పెరగకుండా హామీ ఇస్తుంది.
అంతేకాదు తిన్న తర్వాత అలా కొంత దూరం నడవడం వల్ల మన సృజనాత్మకత కూడా పెరుగుతుంది. చాలామందికి నడకలోనే జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం దొరుకుతుండటం అనుభవమే.