చామ మొక్కకు కాండం అంటూ ఉండదు. చిత్తడి నేలల్లో, కాలువల వెంట చామ ఎక్కువగా పండుతుంది. గుత్తులు గుత్తులుగా చామ దుంపలు పెరుగుతాయి. చామను నేరుగా తింటే నోరు పాడవుతుంది. ఉడకబెట్టి, పులుసుగా, కూరగా వండి చామను వాడుతూంటారు. చామ దుంపలను ఎలాగైనా మనం తరచూ తీసుకోవచ్చు.
చాలా మంది సహజంగానే చామదుంపలు జిగురుగా ఉంటాయనే కారణంతో వాటిని తినేందుకు ఇష్టపడరు. అయితే, ఇతర దుంపలతో పోలిస్తే చామదుంపల్లోనూ మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. చామ దుంపలో పిండి, పీచు పదార్థాలు ఎక్కువ. చామగడ్డలో విటమిన్- ఎ, బి1, బి2, బి3, బి5, బి6, బి9, సి లతోపాటు కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, మాంగనీస్ వంటి పోషకాలతోపాటు పీచు ఎక్కువగా లభిస్తుంది. వీటిని తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెల్సుకుందాం.
అధిక పీచు, యాంటీఆక్సిడెంట్ల కారణంగా చామగడ్డ పలు క్యేన్సర్‌ల నుంచి కాపాడడమే కాకుండా క్యేన్సర్ వ్యాధిగ్రస్తులకు కూడా మంచి ఆహారం. పెద్దప్రేగు, రొమ్ము క్యాన్సర్ పురోగతిని నెమ్మదిస్తుందని ప్రాథమిక అధ్యయనాలు సూచిస్తున్నాయి.
క్రీడాకారులకు తక్షణం శక్తినిచ్చే ఆహారంగా చామదుంపను చెప్పుకోవచ్చు. తక్కువ క్యాలరీ ఆహారం అవ్వడం వల్ల చామ దుంపలను బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్లో చేర్చుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. అజీర్తి, హైపర్ టెన్షన్, కండరాలు బలహీనతకు ఇది మంచి ఔషధంగా పని చేస్తుంది.
చామదుంపల ద్వారా మన శరీరానికి శక్తి లభిస్తుంది. అయితే ఇతర దుంపల్లా వీటిని తినగానే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగవు. చాలా నెమ్మదిగా గ్లూకోజ్ రక్తంలో కలుస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గించి, చెక్కర స్థాయిలను కంట్రోల్ చేయడంలో చామదుంపలు బాగా పనికొస్తాయి. మధుమేహం ఉన్నవారు కూడా ఈ దుంపలను నిరభ్యంతరంగా తినవచ్చు.
గుండె జబ్బులు రాకుండా చేయడంతో పాటు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చామదుంపల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు రాకుండా చూస్తాయి.
చామగడ్డ మూలాల్లోని డయోస్జెనిన్ అనే పదార్థం కొత్త చర్మ కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా పని చేయడం ద్వారా చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది.
అధిక బరువు తగ్గాలనుకునే వారు చామదుంపలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.
ఈ దుంపల్లో ఉండే విటమిన్ బి6 హైబీపీని తగ్గిస్తుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూస్తుంది. మహిళల్లో మెనోపాజ్‌లో వచ్చే సమస్యలు తగ్గాలంటే చామ దుంపలను తినాలి.
గర్భిణీలు చామదుంపలను తినడం వల్ల వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం తదితర లక్షణాలు తగ్గుతాయి.
చామదుంపల్లో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని తగ్గిస్తుంది. తిన్న ఆహారం సాఫీగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
వివిధ రకాల చర్మవ్యాధులను నివారించడంలో ఉపకరిస్తుంది.
ఎముకలను గట్టిపడేలా చేయడంతోపాటు దృష్టిలోపాలను దూరం చేస్తుంది.
హార్మోన్ల సమతుల్యతను నియంత్రించడంలో.. వ్యాధి నిరోధకరత పెంపొందించడంలో సహాయపడుతుంది.