న్యూఢిల్లీ : తీరైన శరీరాకృతితో ఫిట్‌గా కనిపించాలని అందరూ కోరుకుంటారు. ఊబకాయం, పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోవడంతో దాన్ని వదిలించుకునేందుకు పలువురు ఇబ్బంది పడుతుంటారు. అయితే సరైన ఆహారం, వ్యాయామంతో పొట్టను తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోతే మధుమేహం, హృద్రోగ ముప్పుతో పాటు పలు జీవనశైలి వ్యాధులు వెంటాడతాయని కొవ్వు తగ్గించుకునేందుకు కసరత్తు సాగించాలని చెబుతున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో ఎక్కువ గంటలు కదలికలు లేకుండా గడపడం, ఆయిల్ ఫుడ్, ప్రాసెస్డ్ ఆహారం తీసుకోవడం వల్ల పొట్ట భాగంలో కొవ్వు చేరుకునే ప్రమాదం పొంచిఉంది.
పలు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చలికాలంలో అదనపు కొవ్వును కరిగించడం పెద్ద కష్టమేమీ కాదని నిపుణులు చెబుతున్నారు. అధిక బరువు, పొట్ట తగ్గించుకునేందుకు ఉదయాన్నే గోరు వెచ్చని నీటిని తాగాలని, దీంతో శరీరంలో జీవక్రియలు వేగవంతమై జీర్ణ క్రియ సాఫీగా సాగుతుందని పేర్కొంటున్నారు.
ఇది పొట్ట భాగంలోనే కాకుండా శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. నిత్యం యోగా చేయడం ద్వారా శరీరాన్ని ఉత్సాహంగా, తేలికగా చేసుకోవచ్చు. సూర్య నమస్కారాలతో పాటు తేలిక పాటి యోగాసనాలు అభ్యాసం చేయడం ద్వారా రక్తప్రసరణ, జీర్ణక్రియ మెరుగవుతుంది. మరిగించిన నీటిలో అల్లం వేసుకుని ఆ నీటిని తాగడం ద్వారా కొవ్వు కరిగిపోతుంది. రోజుకు అరగంట పాటు వేగంగా నడవడం వలన మెరుగైన ఆరోగ్య ఫలితాలు చేకూరుతాయి. పొట్టలో కొవ్వు కరిగేందుకు వేగంగా నడవడంతో పాటు పైలేట్స్ ప్రాక్టీస్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.