న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ఏటా నమోదయ్యే మరణాల్లో అత్యధిక మరణాలు గుండె పోటుతో సడన్ కార్డియాక్ అరెస్ట్ కారణంగానే సంభవిస్తున్నాయి. గుండెకు రక్త సరఫరా నిలిచిపోవడంతో ముంచుకొచ్చే కార్డియాక్ అరెస్ట్ ప్రాణాపాయ పరిస్ధితికి దారితీస్తోంది. కార్డియాక్ అరెస్ట్‌ను ముందుగా గుర్తించేందుకు ఐదు లక్షణాలను గమనించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తరచూ స్పృహ కోల్పోతుండటం గుండె వైఫల్యం, గుండె పోటుకు ముందస్తు లక్షణమని, గుండె లయ అస్తవ్యస్తం కావడం తరచూ తలతిరగడానికి సంకేతం కావచ్చని చెబుతున్నారు.
ఇది క్రమంగా కార్డియాక్ అరెస్ట్‌కు దారితీయవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తరచూ ఛాతీనొప్పి వస్తున్నా అశ్రద్ధ చేయరాదని శారీరక శ్రమ చేయని సమయంలో కూడా ఛాతీనొప్పి వస్తే అది కార్డియాక్ అరెస్ట్‌కు దారితీసే ప్రమాదం ఉందని చెబుతున్నారు. విశ్రాంతి సమయంలోనూ ఛాతీనొప్పి వస్తుంటే తక్షణమే వైద్యులను సంప్రదించి ఈసీజీ తీయించుకోవడం మేలు. శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులనూ గమనించాలి.
కష్టతరమైన పనులు చేస్తున్న సమయంలో ఊపిరి ఆడని పరిస్ధితి సహజమే అయినా విశ్రాంతి సమయలోనూ శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఎదురైతే వైద్యులను సంప్రదించాలి. గుండె కొట్టుకోవడంలో లయ తప్పడం వల్ల తలెత్తే గుండె దడ తరచూ వేధిస్తున్నా నిర్లక్ష్యం చేయకూడదు. శ్రమ చేయకుండా విశ్రాంతి తీసుకునే సమయంలోనూ గుండె దడగా అనిపిస్తుంటే గుండె ఆరోగ్యాన్ని పరీక్షించుకోవడం అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక రోజంతా నీరసంగా ఉండటం, తలతిరిగినట్టు అనిపిస్తున్నా గుండె ఆరోగ్యాన్ని చెక్ చేసుకోవడం మేలు.