పోషకాలు అధికంగా ఉండే డ్రైఫ్రూట్స్‌ను సూపర్‌ఫుడ్‌గా చెబుతారు. ఆరోగ్యం కోసం ఇప్పుడు చాలామంది వీటిని ఆశ్రయిస్తున్నారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా, ఆఫీసుల్లో చిరుతిండిగా, సాయంత్రాల్లో స్నాక్స్‌గానూ తీసుకుంటున్నారు. అయితే, డ్రైఫ్రూట్స్‌తోపాటు వాటిని తినే సమయం కూడా ముఖ్యమని ఆహార నిపుణులు చెబుతున్నారు. గింజలను ఎప్పుడు తింటారనే దానిపైనే వాటి పోషకాల శోషణ ఆధారపడి ఉంటుందని అంటున్నారు. ఈ క్రమంలో ఏ సమయంలో ఏ గింజలను తీసుకోవాలో సూచిస్తున్నారు.
బాదం: ఇందులో ఫైబర్, ప్రొటీన్, విటమిన్ ఇ, మెగ్నీషియం లాంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర నియంత్రణకు, మెదడు పనితీరుకు మద్దతునిస్తాయి. పూర్తి ఆరోగ్య ప్రయోజనాలను పొందాలంటే.. బాదం పప్పులను ఉదయం పూట తీసుకోవడం మంచిది. రాత్రిపూట ఒక గుప్పెడు బాదం పప్పును నీటిలో నానబెట్టి.. ఉదయం పూట తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
జీడిపప్పు: డ్రైఫ్రూట్స్‌లో రారాజుగా పిలుచుకునే జీడిపప్పులో ఫైబర్, ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా లభిస్తాయి. బరువును తగ్గించడంలో, చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ముందుంటాయి. రోగనిరోధక శక్తి, జీవక్రియకూ సహకరిస్తాయి. వీటిని మధ్యాహ్నం తినడం వల్ల.. రాత్రి భోజనం వరకూ కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. అదే సమయంలో శరీరానికి కావాల్సిన శక్తి కూడా అందుతుంది.
వాల్నట్స్: అత్యంత ఆరోగ్యకరమైన డ్రైఫ్రూట్గా వాల్నట్లను పరిగణిస్తారు. ఇందులో ఒమేగా-3, ప్రొటీన్, కొవ్వు ఆమ్లాలు, యాంటి ఆక్సిడెంట్లు, ఫైబర్ సమృద్ధిగా లభిస్తాయి. ఇందులోని మెలటోనిన్.. మెదడు ఆరోగ్యానికి భరోసా ఇవ్వడంతోపాటు మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. కాబట్టి, సాయంత్రం పూట వాల్నట్స్ తీసుకుంటే.. మంచి నిద్ర పడుతుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
పల్లీలు: రోజులో ఏ సమయంలోనైనా వీటిని తీసుకోవచ్చు. వీటిలో రెస్వెరాట్రాల్, నియాసిన్ అనే పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి గుండెతోపాటు మెదడు ఆరోగ్యానికి భరోసా ఇస్తాయి. శరీరానికి కావాల్సిన ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి.
పిస్తా: ప్రొటీన్, ఫైబర్‌తో నిండి ఉండే పిస్తా.. శరీరంలో శక్తిని స్థిరీకరిస్తుంది. కడుపు నిండిన భావన కలిగించి.. ఆకలి కోరికలను అణచివేస్తుంది. వీటిని ఉదయంపూట తీసుకుంటే.. గరిష్ఠ ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా, వ్యాయామం చేయడానికి ముందు వీటిని తీసుకుంటే మంచిది.