Health tips | ఉదయం లేవగానే ఆకలి, ఆకలి అంటూ ఇంట్లో వాళ్లను ఊదరగొడ్తుంటాం. కొందరు అలా బ్రష్ చేస్తారో లేదో.. ఇలా ఏది కనిపిస్తే అది లాగించేస్తుంటారు. మరికొందరేమో బయటకెళ్లి శుభ్రంగా పొట్ట పూజ చేసేస్తుంటారు. ఇలా పరిగడుపునే ఏది పడితే అది తినడం మంచిది కాదని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఉదయం వేళ కడుపు ఖాళీగా ఉంటుంన్నందున కొన్నిరకాల ఆహారాలను తీసుకోకుండా జాగ్రత్తపడాలని హెచ్చరిస్తున్నారు. అలా తీసుకోవడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడతాయంట. ఉదయం వేళ కడుపు ఖాళీగా ఉండటంతో మనం తీసుకునే కొన్ని రకాల ఆహారాలు కడుపు లోపలి భాగాలపై ప్రభావం చూపుతాయి. దాంతో కడుపులో మంట, నొప్పి, ఛాతీలో మంట, అజీర్తి వంటి సమస్యలు కనిపిస్తాయి.
ఉదయాన్నే మసాలా లేదా ఫ్రైడ్ ఫుడ్స్ తినకుండా చూసుకోవాలి. పరిగడుపునే వీటిని తింటే కడుపులో మంట, అజీర్తి సమస్యలు వస్తాయి. అలాగే కడుపు, ఛాతీ బరువుగా అన్పించి ఇబ్బంది కలుగుతుంది.
పీచు పదార్థాలు కడుపుకు మంచివే. అయితే, ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం నష్టం చేకూరుస్తాయి. దాంతో కడుపులో నొప్పి, కడుపు పట్టేయడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
చాలా మందికి బ్రష్ చేసుకోగానే కాఫీ లేదా టీ సిప్ చేయకపోతే పిచ్చెక్కినట్లుగా ఉంటుంది. లేవగానే కాఫీ లేదా టీ తాగడం వల్ల ఛాతీలో మంట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి. దీనికి బదులుగా గోరువెచ్చటి నీరు తాగడం శ్రేయస్కరం.
పరిగడుపున ఆల్కహాల్ తీసుకోవడం ప్రమాదకరమైందని గుర్తుంచుకోవాలి. ఉదయాన్నే ఆల్కహాల్ తీసుకుంటే కాలేయంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఖాళీ కడుపుతో మద్యం తీసుకోవడం వల్ల రక్తంలో ఆల్కహాల్ వేగంగా వ్యాపించి రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.