Health | కొంతమంది నోట్లోంచి పసరు మొత్తాన్నీ బయటికి లాగకుండా ముఖం కడుక్కోవడం పూర్తిచేయరు. బలవంతంగా పసరు బయటికి తీయడం వారికి అలవాటుగా మారిపోతుంది. అయితే, ఈ అలవాటు అనేక అనారోగ్య సమస్యల్ని కలిగిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బలవంతంగా పసరు తీయడం వల్ల కలిగే నష్టాలను వివరిస్తున్నారు.
నోట్లోంచి వేలు పెట్టి.. బలవంతంగా పసరుని బయటికి తీయడం వల్ల కడుపులోని యాసిడ్ రివర్స్ అవుతుంది. దీంతో అసిడిటీ, గుండెల్లో మంట పెరుగుతుంది. కడుపులోని పసరుని బయటికి తీస్తే జీర్ణ సమస్యలు వస్తాయి. తిన్న ఆహారం మొత్తం వెనకి వచ్చి సరిగ్గా జీర్ణమవ్వదు. దాంతో రోజంతా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ చర్య గొంతుమంటకీ కారణమై.. ఇన్ఫెక్షన్ సోకుతుంది. పసరులోని యాసిడ్ వల్ల గొంతులో ఉండే సున్నితమైన కణజాలం దెబ్బతిని మంట పుడుతుంది. గొంతు బొంగురుపోతుంది కూడా. కొంతమందికి ఇలా చేయడం వల్ల దగ్గు మొదలవుతుంది. ఎంత కంట్రోల్ చేసినా ఆగదు. అదేపనిగా దగ్గుతూనే ఉంటారు.
అంతేకాదు.. శరీరానికి కావాల్సిన పొటాషియం, సోడియం కూడా పసరుతోపాటే బయటికి వెళ్లిపోయి నీరసమైపోతారు. కడుపులోని యాసిడ్ గాఢత ఎకువగా ఉండటం వల్ల దంతాలపై ఉండే రక్షణ కవచం దెబ్బతింటుంది. పళ్లు బలహీన పడతాయి. పసరు తీస్తున్నక్రమంలో కొన్నిసార్లు ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. దీని వల్ల నిమోనియా సమస్య తలెత్తుతుంది. అందుకే.. నిదానంగా బ్రష్ చేయడం, నోటిని క్లీన్ చేసుకోవడం మంచిది. ఇన్ని సమస్యలకీ కారణమవుతున్న పసరు తీసే అలవాటుని మానేయడమే మంచిది.