కిడ్నీ కష్టాన్ని కనిపెట్టండి
మన శరీరంలో ఎలాంటి విరామం లేకుండా నిరంతరం పనిచేసే అత్యంత ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి. శరీరంలో పేరుకుపోయే మలినాలను బయటికి పంపించడం నుంచి రక్తపోటును నియంత్రించడం వరకు అనేక కీలక బాధ్యతలను ఇవి నిర్వహిస్తాయి. అయితే మూత్రపిండాలు దెబ్బతినడం ప్రారంభమైనా చాలాకాలం వరకు ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. అందుకే కిడ్నీ రుగ్మతలను నిశ్శబ్దంగా దెబ్బతీసే వ్యాధులుగా వైద్యులు పేర్కొంటున్నారు.
మన శరీరంలో ఎలాంటి విరామం లేకుండా నిరంతరం పనిచేసే అత్యంత ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి. శరీరంలో పేరుకుపోయే మలినాలను బయటికి పంపించడం నుంచి రక్తపోటును నియంత్రించడం వరకు అనేక కీలక బాధ్యతలను ఇవి నిర్వహిస్తాయి. అయితే మూత్రపిండాలు దెబ్బతినడం ప్రారంభమైనా చాలాకాలం వరకు ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. అందుకే కిడ్నీ రుగ్మతలను నిశ్శబ్దంగా దెబ్బతీసే వ్యాధులుగా వైద్యులు పేర్కొంటున్నారు. ప్రస్తుత కాలంలో మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడిన జీవనశైలి, తక్కువ నీరు తాగడం వంటి కారణాలతో మూత్రపిండాల వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు వృద్ధాప్యంలో మాత్రమే ఎక్కువగా కనిపించే ఈ సమస్యలు ఇప్పుడు యువతలో కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం.
భారతదేశంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధుల బారినపడుతున్నారు. వారిలో చాలామంది చివరి దశలో మాత్రమే సమస్యను గుర్తిస్తున్నారు. ఫలితంగా రక్త శుద్ధి చికిత్సలు, మూత్రపిండాల మార్పిడి అవసరమయ్యే పరిస్థితులు తలెత్తుతున్నాయి. అయితే సరైన అవగాహన, ముందస్తు పరీక్షలు, జీవనశైలిలో మార్పులు, ఆధునిక చికిత్సలతో మూత్రపిండాల వ్యాధులను నియంత్రించడం మాత్రమే కాకుండా నివారించడమూ సాధ్యమే అంటున్నారు నిపుణులు.
మూత్రపిండాలు చేసే ప్రధాన పనులు
రక్తాన్ని శుద్ధి చేయడం: మూత్రపిండాలు నిరంతరం రక్తాన్ని వడగట్టి శరీరానికి అవసరం లేని మలినాలను మూత్రం రూపంలో
బయటికి పంపిస్తాయి.
శరీరంలో నీటి సమతౌల్యాన్ని కాపాడటం: శరీరంలో నీరు అధికమైనా, తక్కువైనా సమతౌల్యాన్ని నిలుపుకోవడంలో మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి.
రక్తపోటు నియంత్రణ: ప్రత్యేక రసాయన పదార్థాల ద్వారా రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.
రక్తహీనతను నివారించడం: ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి అవసరమైన హార్మోన్ల తయారీలో సహకరిస్తాయి.
ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడం: విటమిన్ డిని శరీరానికి ఉపయోగపడే రూపంలోకి మార్చి క్యాల్షియం శోషణకు సహకరిస్తాయి.
అసలు కారణాలు..
మధుమేహం: రక్తంలో అధిక చక్కెర స్థాయులు మూత్రపిండాల్లోని సూక్ష్మ రక్తనాళాలను దెబ్బతీస్తాయి.
అధిక రక్తపోటు: రక్తపోటు ఎక్కువగా ఉండటం వల్ల మూత్రపిండాల వడపోత వ్యవస్థ బలహీనపడుతుంది.
అధిక ఉప్పు: ప్యాకెట్లలో లభించే ఆహారాలు, ఊరగాయలు, వేయించిన పదార్థాలు అధికంగా తీసుకోవడం వల్ల ప్రమాదం పెరుగుతుంది.
తక్కువ నీరు తాగడం: శరీరంలో నీటి లోపం ఏర్పడి మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది.
నొప్పి నివారణ మాత్రలు: వైద్యుల సలహా లేకుండా తరచూ నొప్పి నివారణ మందులు వాడటం మూత్రపిండాలకు హానికరం.
ధూమపానం, మద్యపానం: ఇవి రక్తప్రసరణను దెబ్బతీసి మూత్రపిండాల పనితీరును తగ్గిస్తాయి.
తొలి హెచ్చరికలు
ప్రారంభ దశల్లో లక్షణాలు కనిపించకపోయినా, వ్యాధి ముదిరేకొద్దీ కొన్ని సంకేతాలు కనిపిస్తాయి.
- మూత్రంలో నురగ రావడం
- కాళ్లు, కళ్ల కింద వాపు
- తరచూ అలసట
- ఆకలి మందగించడం
- వాంతులు
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
- రాత్రిళ్లు ఎక్కువసార్లు మూత్రం రావడం
- అధిక రక్తపోటు
- చర్మం పొడిబారడం, దురద
వాపు ఉన్న చోట వేలితో నొక్కితే గుంట పడితే అది మూత్రపిండాల సమస్యకు సంకేతం కావచ్చు.

తలెత్తే సమస్యలు
రక్తపోటు పెరుగుతుంది: మూత్రపిండాల పనితీరు తగ్గిపోతే రక్తపోటునియంత్రణ తప్పుతుంది.
శరీరంలో మలినాలు పేరుకుపోతాయి: రక్తంలో మలిన పదార్థాలు పేరుకుని అలసట, బలహీనత కలుగుతాయి.
రక్తహీనత: ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గిపోవడంతో రక్తహీనత ఏర్పడుతుంది.
ఎముకలు బలహీనపడతాయి: విటమిన్ డి లోపంతో ఎముకల బలహీనత తలెత్తుతుంది.
గుండె సమస్యలు: మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారిలో గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుంది.
మూత్రపిండాల సంరక్షణ అధిక ఉష్ణోగ్రతల కారణంగా చెమట ద్వారా శరీరంలోని నీరు ఎక్కువగా బయటకు వెళుతుంది. తగినంత నీరు తాగకపోతే శరీరంలో నీటి లోపం ఏర్పడి మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- తరచూ నీరు తాగాలి. ఒకేసారి ఎక్కువగా కాకుండా కొద్దికొద్దిగా తరచూ తాగడం మంచిది.
- కొబ్బరి నీరు, మజ్జిగ తీసుకోవాలి. ఇవి శరీరానికి అవసరమైన లవణాలను అందిస్తాయి.
- ఎండలో ఎక్కువసేపు తిరగకూడదు. చక్కెర పానీయాలు, శీతల పానీయాలు మూత్ర పిండాలకు హానికరం.
- నీరు ఎక్కువగా ఉండే పుచ్చకాయ, దోసకాయ, మొసంబి లాంటి పండ్లు రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి.
ఆధునిక చికిత్సల్లో వచ్చిన పురోగతి
మూత్రపిండాల వ్యాధుల చికిత్సలో వైద్యరంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నది. మూత్రంలో ప్రొటీన్ నష్టాన్ని తగ్గించి మూత్రపిండాల పనితీరును కాపాడే సమర్థమైన మందులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి ఆధునిక పద్ధతులతో రోగులకు మెరుగైన ఫలితాలు అందుతున్నాయి. చిన్న గాయాలతో శస్త్రచికిత్స చేసే ఆధునిక విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు రక్తం గ్రూపులు భిన్నంగా ఉన్నా మూత్రపిండాల మార్పిడి విజయవంతంగా చేస్తున్నారు. కృత్రిమ మేధస్సు సాయంతో మూత్రపిండాల వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించే పద్ధతులు అభివృద్ధి చెందుతున్నాయి.
మూత్రపిండాల మార్పిడి
జీవితాంతం రక్త శుద్ధి చికిత్సపై ఆధారపడటం కంటే మూత్రపిండాల మార్పిడి ఉత్తమ పరిష్కారం. కుటుంబ సభ్యుల నుంచి తీసుకున్న మూత్రపిండాలతో ఆరోగ్యం త్వరగా కుదురుకునే అవకాశాలు ఉన్నాయి. ఒక మూత్రపిండంతో కూడా సాధారణ జీవితం గడపవచ్చు. మూత్రపిండం దానం చేయడం వల్ల శరీరానికి పెద్ద నష్టం ఉండదు.
తప్పనిసరి పరీక్షలు
- రక్తంలోని క్రియాటినిన్
- మూత్రపిండాల వడపోత సామర్థ్యం
- మూత్రంలో ప్రొటీన్
- రక్తపోటు
- రక్తంలో చక్కెర స్థాయులు
- పొత్తికడుపు అల్ట్రాసౌండ్
మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు సంవత్సరానికి కనీసం ఒకసారి ఈ పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.
తీసుకోవాల్సినవి
- తాజా కూరగాయలు
- పండ్లు
- మజ్జిగ
- తక్కువ ఉప్పు
- పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారం

తగ్గించాల్సినవి
- మాంసం
- ప్యాకేజ్ ఫుడ్
- ఊరగాయలు
- వేపుళ్లు
శీతల పానీయాలు
మూత్రపిండాలు మౌనంగా పనిచేస్తాయి.. కానీ, అవి దెబ్బతింటే శరీరమంతా ప్రభావితమవుతుంది. అందుకే ముందస్తు జాగ్రత్తలు, ఆరోగ్యకరమైన జీవనశైలి, సమయానికి పరీక్షలు అత్యంత ముఖ్యం. వైద్యరంగంలో ఆధునిక సాంకేతికత వల్ల ఇప్పుడు మూత్రపిండాల వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి సమర్థంగా చికిత్స అందించడం సాధ్యమవుతున్నది. కాబట్టి, చేతులు కాలకముందే.. ఆరోగ్యంలో కాస్త మార్పులు కనిపించినా వెంటనే వైద్యుణ్ని సంప్రదించడం చాలా అవసరం.
పాటించాల్సిన పది సూత్రాలు
- రోజూ సరిపడా నీరు తాగాలి.
- వంటకాల్లో వీలైనంత ఉప్పు తగ్గించాలి.
- రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలి.
- ధూమపానం మానేయాలి.
- వైద్యుల సలహా లేకుండా ఏ మందులూ వాడకూడదు.
- రోజూ వ్యాయామం చేయాలి.
- ఊబకాయాన్ని తగ్గించుకోవాలి.
- మూత్రంలో మార్పులను నిర్లక్ష్యం చేయొద్దు.
- సంవత్సరానికి ఒకసారి పరీక్షలు చేయించుకోవాలి.
- ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి.
– డాక్టర్. రాజశేఖర చక్రవర్తి సీనియర్ నెఫ్రాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్, యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ, హైదరాబాద్
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- body damage
- diseases
- doctors
- kidney
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

