Kidney Failure | సాధారణంగా మన గోర్లు, చర్మం, పాదాలు, నాలుక వంటి వాటిని చూసి మన ఆరోగ్యాన్ని అంచనా వేయవచ్చు. ఈ అవయవాల్లో వచ్చే మార్పులను బట్టి మన శరీరంలో అంతర్లీనంగా ఉన్న అనారోగ్య సమస్యలను చెప్పవచ్చు. వీటితో పాటుగా మన కళ్లను చూసి కూడా మన ఆరోగ్యాన్ని అంచనా వేయవచ్చని మీకు తెలుసా.. అవును మన కళ్లను బట్టి మన మూత్రపిండాల ఆరోగ్యాన్ని అంచనా వేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. మూత్రపిండాల్లో వాపు లేదా మూత్రంలో వచ్చేమార్పు మన దృష్టిని కూడా ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మూత్రపిండాలు, కళ్లు ఆరోగ్యకరమైన రక్తనాళాలు, ద్రవ సమతుల్యతపై ఆధారపడి ఉంటాయి. కనుక ఒకదానిలో వచ్చే సమస్యలు మరొక దానిపై ప్రభావాన్ని చూపుతాయి.
కళ్లు చూపించే కొన్ని సంకేతాలను బట్టి మనం మూత్రపిండ సంబంధిత అనారోగ్య సమస్యలను అంచనా వేయవచ్చు. మూత్రపిండాలు పనిచేయడం క్షీణించినప్పుడు కంటి సమస్యలతో పాటు దృష్టి సమస్యలు కూడా వస్తాయి. మూత్రపిండాల సమస్యలను తెలియజేసే సాధారణ కంటి లక్షణాల గురించి తెలుసుకుందాం. మనం నిద్ర లేచిన తరువాత కళ్లు వాపులుగా ఉంటాయి. ఇది సర్వ సాధారణమే. అయితే కళ్లు నిరంతరం వాపులకు గురై ఉండడం అనేది ప్రోటీన్యూరియాకు సంకేతం కావచ్చు. మూత్రపిండాలు దెబ్బతినడం వల్ల మూత్రంలో ప్రోటీన్ లీక్ అవుతుంది. ప్రోటీన్ లీక్ అవ్వడం వల్ల కళ్ల చుట్టూ ద్రవం పేరుకుపోతుంది. అంతేకాకుండా నురుగు లేదా బుడగల వంటి మూత్రం వస్తుంది. ఇటువంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించడం అవసరం.
దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బంది, అస్పష్టత లేదా డబుల్ విజన్ వంటి దృష్టి మార్పులు కళ్ళలోని చిన్న రక్తనాళాల సమస్యల వల్ల సంభవించవచ్చు. దీనిని హైపర్టెన్సివ్ లేదా డయాబెటిక్ రెటినోపతి అని పిలుస్తారు. అధిక రక్తపోటు, డయాబెటిస్ రెండు కూడా మూత్రపిండాల వ్యాధులకు ప్రధాన కారణాలు. ఇవి రెండు కూడా రెటీనాలోని రక్తనాళాలను దెబ్బతీస్తాయి. దీర్ఘకాలికంగా కళ్లు పొడిబారడం, దురద వంటి అసౌకర్యాలు కూడామూత్రపిండాల సమస్యలను సూచిస్తాయి. డయాలసిస్ చేయించుకునే వ్యక్తుల్లో ఇవి సర్వసాధారణం. క్యాల్షియం, ఫాస్పేట్ వంటి ఖనిజాల అసమతుల్యత, కంటి సరళతను ప్రభావితం చేసే వ్యర్థ ఉత్పత్తుల నిర్మాణం వల్ల ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కళ్లు తరచూ ఎర్రగా, నొప్పిగా అనిపిస్తే మూత్రపిండాల సంబంధిత పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.
కళ్లు ఎర్రబడడం, అలసట, అలర్జీ, ఇన్పెక్షన్ వంటి లక్షణాలు కూడా మూత్రపిండాల సమస్యలను సూచిస్తాయి. మూత్రపిండాల పనితీరు మదగించడం వల్ల రక్తనాళాల్లో పెరిగిన ఒత్తిడి కళ్ల కేశనాళికలలో చిన్న చీలికలకు దారి తీస్తుంది. దీంతో కళ్లు రక్తంతో నిండినట్లు కనిపిస్తాయి. మూత్రపిండాల పనితీరు తగ్గడం వల్ల నీలం, పసుపు వంటి రంగులను చూడడంలో స్వల్ప మార్పులు కనిపిస్తాయి. మూత్రపిండాల వడపోత సరిగా లేకపోవడం వల్ల శరీరంలో వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల ఆప్టిక్ నరాలు దెబ్బతింటాయి. రంగులను చూడడంలో వచ్చే ఈ ఇబ్బందులు మొదట్లో నెమ్మదిగా ప్రారంభమై కాలక్రమేణా ఎక్కువవుతాయి. మనం సాధారణంగా మూత్రపిండాలకు, కళ్లకు ఎటువంటి సంబంధం ఉండదని భావిస్తూ ఉంటాం. కానీ కళ్లు చూపించే ఈ లక్షణాలు మూత్రపిండాల సమస్యలను కూడా తెలియజేస్తాయి. కనుక కళ్లు ఇటువంటి లక్షణాలను చూపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం.