Anjeer fruit : ప్రకృతి ప్రసాదాలైన పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిలో ఏ పండు ప్రత్యేకత దానిదే. దేని ప్రయోజనాలు దానివే. అదేవిధంగా అంజీర పండ్ల ప్రత్యేకత అంజీర పండ్లకే ఉన్నది. అంజీర పండ్లు లేదా అత్తి పండ్లను ప్రతి రోజూ తినడంవల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎండిన అత్తి పండ్లను నానబెట్టి తినాలని వైద్యులు సిఫారసు చేస్తున్నారు. ఇలా తినడంవల్ల రక్తం ఉత్పత్తి పెరిగి, బలహీనత తొలగిపోతుందని చెబుతున్నారు. అంజీరా పండ్లతో ఇంకా ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం..
ప్రయోజనాలు
మలబద్ధకం సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. సాధ్యమైనంత త్వరగా ఈ సమస్య తగ్గాలంటే రోజూ నానబెట్టిన అత్తిపండ్లను తినాలి. అత్తి పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రీ బయోటిక్లా పనిచేస్తుంది. రోజూ అంజీరా తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మల విసర్జన సులభమవుతుంది.
అంజీర పండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తపోటు నియంత్రణకు తోడ్పడుతుంది. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. చర్మ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు సి, ఇ, ఎ కూడా దీనిలో ఉన్నాయి. అందేరూ అంజీర పండ్లు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. దీనివల్ల చర్మం యవ్వనంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
ఎముకలను పరిపుష్టం చేయడానికి కూడా అంజీర పండ్లు తోడ్పడుతాయి. నానబెట్టిన అత్తిపండ్లలో క్యాల్షియం, ఫాస్పరస్ ఎక్కువగా ఉండటంవల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి.
నానబెట్టిన అత్తి పండ్లను తినడంవల్ల శరీరంలో ఆక్సిడేషన్ ఒత్తిడి తగ్గుతుంది. డయాబెటిస్ ఉన్నవారు వీటిని కొద్ది మొత్తంలో తినవచ్చు. వీటివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా తగ్గుతాయి. అయితే వీటిలో ఉండే తీపి కారణంగా చాలామంది డయాబెటిస్ రోగులు వీటిని తినేందుకు భయపడతారు. కానీ రోజుకు ఒకట్రెండు తినడంవల్ల ఎలాంటి సమస్యా ఉండదని నిపుణులు చెబుతున్నారు.
స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నవారు ప్రతిరోజు పాలలో నానబెట్టిన అంజీర పండ్లను తినడంవల్ల మేలు జరుగుతుంది. ఇలా చేయడంవల్ల వారిలో స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. కాబట్టి స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటంవల్ల సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వారికి ఇది చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు.
సాధారణంగా చిన్న పిల్లలు, మహిళలు ఎక్కువగా రక్తహీనత సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారు ప్రతిరోజు అంజీర పండ్లను తినడంవల్ల ప్రయోజనం ఉంటుంది. రక్తం ఉత్పత్తి పెరిగి రక్తహీనత సమస్య తగ్గుతుంది.
మహిళలు రుతుస్రావానికి ముందు, హార్మోన్ల మార్పుల సమయంలో అత్తిపండ్లను తినడం మంచిది. అదేవిధంగా మెనోపాజ్ దశలో అత్తిపండ్లు తినడంవల్ల అనేక రుతు సంబంధ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కాబట్టి మెనోపాజ్ దశకు దగ్గరలో ఉన్నవాళ్లు అంజీర పండ్లను తినడం అలవాటు చేసుకోవాలి.