Yoga | ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ మనం వ్యాయామం చేయాలన్న విషయం అందరికీ తెలిసిందే. వ్యాయామం వల్ల శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటాం. అయితే వ్యాయామాలన్నింటిలోనూ యోగా ఎంతగానో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఒకప్పుడు కేవలం మన దేశానికి మాత్రమే పరిమితమైన యోగా ఇప్పుడు ప్రపంచ దేశాలకు విస్తరించింది. పాశ్చాత్యులు సైతం యోగాను రోజూ అనుసరిస్తున్నారు. ఈ క్రమంలోనే రోజూ యోగా చేయడం వల్ల అనేక లాభాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. యోగాలో అనేక ఆసనాలు, క్రియలు ఉంటాయి. అన్నింటినీ కాకపోయినా ఎవరి శరీరానికి తగిన ఆసనాలను వారు రోజూ వేస్తే ఎంతగానో ఫలితం ఉంటుందంటున్నారు. ముఖ్యంగా యోగాను రోజూ కనీసం 10 నిమిషాల పాటు చేసినా అద్భుతమైన లాభాలను పొందవచ్చని వారు చెబుతున్నారు.
రోజూ యోగా చేయడం వల్ల శరీరం సాగే గుణాన్ని పొందుతుంది. ముఖ్యంగా కండరాలు సులభంగా వంగే గుణాన్ని పొందుతాయి. దీంతో శరీర భాగాలను ఎటంటే అటు సులభంగా తిప్పవచ్చు. వృద్ధాప్యంలో శరీర భాగాలు పట్టుకుపోకుండా సులభంగా ఎటంటే అటు కదులుతాయి. నడిచినా, రన్నింగ్ చేసినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. శారీరకంగా దృఢంగా ఉంటారు. యోగా చేయడం వల్ల కండరాల సామర్థ్యం పెరుగుతుంది. బలహీనంగా ఉన్న కండరాలు బలంగా మారుతాయి. చక్కని దేహాకృతి సొంతమవుతుంది. యోగా వల్ల శరీరం సరైన బ్యాలెన్స్‌ను పొందుతుంది. తూలి పడిపోకుండా ఉంటారు. వృద్ధాప్యంలో శరీరాన్ని బ్యాలెన్స్ చేయడం కష్టమవుతుంది. కానీ యోగా చేసేవారికి ఈ సమస్య రాదు. శరీరంలోని ముఖ్యమైన భాగాల్లో ఉండే కండరాలు సైతం దృఢంగా మారుతాయి. దీంతో చక్కని భంగిమ సొంతమవుతుంది. ఆరోగ్యంగా ఉంటారు.
యోగా చేయడం వల్ల శ్వాస మీద దృష్టి పెడతారు. దీని వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. శరీరంలోని భాగాలకు రక్తం సరిగ్గా లభిస్తుంది. పోషకాలు అందుతాయి. దీంతో పోషకాహార లోపం తగ్గుతుంది. శరీర భాగాలకు ఆక్సిజన్ సైతం సరిగ్గా లభిస్తుంది. దీని వల్ల నీరసం, అలసట తగ్గుతాయి. యోగా చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ముఖ్యంగా అజీర్తి తగ్గుతుంది. ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. మలబద్దకం నుంచి బయట పడవచ్చు. యోగా వల్ల మానసిక ఆరోగ్యం సైతం మెరుగు పడుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు. రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి తగ్గుతుంది.
శరీరంలో కొందరికి ఎల్లప్పుడూ తరచూ నొప్పులు ఉంటాయి. అలాంటి వారు రోజూ యోగాను సాధన చేస్తుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. అలాగే ప్రస్తుతం చాలా మంది గంటల తరబడి కూర్చుని పనిచేస్తున్నారు. దీని వల్ల వెన్నెముక సమస్యలు, భుజాలు, మెడ నొప్పి కూడా వస్తున్నాయి. అలాంటి వారు యోగా చేస్తుంటే ఫలితం ఉంటుంది. షుగర్ సమస్య ఉన్నవారు కూడా రోజూ యోగా చేయాలి. దీని వల్ల శరీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. ఇలా రోజూ యోగాను చేస్తుంటే అనేక లాభాలను పొందవచ్చు. అయితే ఆరంభంలో రోజుకు 10 నిమిషాల పాటు చేసినా క్రమంగా సమయాన్ని పెంచుతూ చేస్తుంటే ఇంకా ఎక్కువ ఫలితాన్ని త్వరగా రాబట్టవచ్చు. ఇతర వ్యాయామాలు చేయలేని వారికి యోగా చక్కని ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు.