మా చెల్లికి రెండు వారాల క్రితం పాప పుట్టింది. పుట్టుకతోనే బిడ్డకు ఫ్రాక్చర్ ఉందని చెప్పారు. నొప్పి తగ్గడానికి డ్రాప్స్ రాసిస్తామన్నారు. అదే అతుక్కుపోతుందన్నారు. ఫ్రాక్చర్ గురించి కంగారు పడొద్దన్నారు. ఇలా పుట్టగానే పిల్లలకు ఫ్రాక్చర్స్ అవుతాయా? నమ్మశక్యంగా లేదు. ఏం చేయాలో చెప్పగలరు?
మీ చెల్లి కూతురుకి పుట్టుకతోనే ఎముక విరిగి ఉందన్నారు. అలా జరుగుతుందా అని మీ సందేహం. కొంతమంది శిశువుల్లో ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది. ప్రసవ సమయంలో ఏదైనా సమస్య ఉన్నట్టయితే ఇలాంటి పరిస్థితి ఏర్పడవచ్చు. కాన్పు చేసేటప్పుడు కాలర్ బోన్ విరగడం, చేయి (హ్యూమసర్) ఎముక విరగడం జరగవచ్చు. ఇలాంటి ఫ్రాక్చర్లు వాటంతట అవే తగ్గుతాయి. నొప్పికి ఉపశమనం కలిగించే మందులు వాడితే సరిపోతుంది. చిన్నపిల్లల ఎముకలు తేలికగా అతుక్కుంటాయి. కానీ, కొన్ని జన్యుపరమైన సమస్యలు ఉంటే మాత్రం సరైన చికిత్స అవసరం.
జన్యుపరమైన ఇబ్బంది ఉన్నవాళ్లలో ఎముకలు అనేకచోట్ల విరుగుతాయి. ప్రీమెచ్యూర్ శిశువుల్లో ఫాస్పేట్ లవణం లోపం ఉంటే ఎముకలు బలపడవు. అలాంటప్పుడు ఫ్రాక్చర్స్ అవుతాయి. మీ చెల్లి బిడ్డకు సమస్య తీవ్రంగా లేదు. అనేక చోట్ల పగుళ్లు వచ్చినట్లుగా చెప్పలేదు. కాబట్టి బహుశా ఆ పాపాయిది చిన్న సమస్యే! అది ప్రసవం సందర్భంలో ఇబ్బందుల వల్ల విరిగి ఉండొచ్చు. పిల్లల ఎముకల (ఆర్థోపెడిక్ పీడియాట్రీషియన్) వైద్యుడితో సరైన పరీక్ష చేయిస్తే కచ్చితమైన నిర్ధారణకు రావొచ్చు. కంగారు పడేంత సమస్య అయితే కాదు. మందులతో పరిష్కారం అవుతుంది.
– డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్