Corona virus | న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: కరోనా మొదలైన కొత్తలో దాని పట్ల ఉన్న భయం చాలామందిలో ఇప్పుడు లేదు. భయం తగ్గడం మంచిదే అయినా కొవిడ్ పట్ల అప్రమత్తత కూడా తగ్గిపోవడమే మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. పదే పదే కొవిడ్ బారిన పడటం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయని, గుండె, ఊపిరితిత్తులపై దాని ప్రభావం అధికంగా ఉంటున్నదని హెచ్చరిస్తున్నారు. ఎక్కువసార్లు కరోనా సోకిన వారిలో గుండె కండరాల వాపు(మయోకార్డిటిస్) సమస్య వచ్చే ముప్పు మూడు రెట్లు అధికంగా ఉంటుందని పేర్కొంటున్నారు.
మయోకార్డిటిస్ వల్ల గుండెపోటుకు గురయ్యే ముప్పుతో పాటు డయాబెటిస్, బీపీ వంటి సమస్యలు వస్తాయని పేర్కొంటున్నారు. కొవిడ్ ఎక్కువసార్లు సోకిన వారిలో ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ ముప్పు కూడా మూడున్నర రెట్లు అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవే కాక ఆస్తమా, దీర్ఘకాల శ్వాసకోస సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని తెలిపారు. కాగా, దేశంలో కరోనా క్రమంగా తీవ్రమవుతున్నది. యాక్టివ్ కేసులు 31 వేలు దాటాయి. కొత్తగా 6,115 మందికి కరోనా సోకింది. 11 మంది మృత్యువాతపడ్డారు. రోజువారీ పాజిటివిటీ రేటు 5.63 శాతంగా నమోదైంది.