Health | హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): మనం తీసుకునే ఆహారంలో 30 శాతానికి మంచి కొవ్వులు ఉండడం ఆరోగ్యానికి హానికరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. కూరగాయలు, పండ్లు, చిరు ధాన్యాలను కూడా ఆహారంలో భాగంగా చేసుకోవాలని సూచించింది. కొవ్వులు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం మేలని పేర్కొంది. వయసును బట్టి కార్బొహైడ్రేట్లు, కొవ్వులు, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఎంత మేర అవసరమో పేర్కొంటూ తాజాగా నివేదిక విడుదల చేసింది.
ఫైబర్‌తో జీర్ణక్రియ మెరుగు
తృణ ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పప్పులు తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. వీటిని తరచూ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, టైప్-2 డయాబెటిస్ వంటి ముప్పు నుంచి బయటపడొచ్చు. ఆహారంలో ఫైబర్ ఉండేలా జాగ్రత్త పడడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుచుకోవచ్చు. 10 ఏండ్ల దాటిన పిల్లలు రోజులో పండ్లు, కూరగాయలు వంటివి కనీసం 400 గ్రాములు తీసుకోవాలి. 2-5 ఏండ్లలోపు వారు 250 గ్రాములు, 6-9 ఏండ్ల మధ్య వయసు వారు 350 గ్రాములు తీసుకోవాలి. పెద్దలు తీసుకునే ఆహారంలో కనీసం 25 గ్రాముల ఫైబర్ ఉండాలి. 2-5 ఏండ్ల పిల్లలు 15 గ్రాములు, 6-9 ఏండ్ల మధ్యనున్న పిల్లలకు 21 గ్రాముల ఫైబర్ తప్పనిసరి.
కొవ్వులను దూరం పెడితే బరువు నియంత్రణ
కొవ్వు పదార్థాలను దూరం పెట్టడం ద్వారా బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. శరీరంలోకి తీసుకునే ఆహారపు శక్తి విలువలో (క్యాలరీలు) 30 శాతానికి మించి కొవ్వులు ఉండకుండా చూసుకోవాలి. అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు (అసంతృప్త కొవ్వు ఆమ్లాలు) మొత్తం ఆహార విలువలో ఒక శాతానికి మించకూడదు. ఆహారంలో అసంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉండకూడదు. రోజువారీ తీసుకునే సంతృప్త కొవ్వులతో పోల్చితే 10 శాతానికి మించకూడదు.