Health Tips | వర్షాకాలం వస్తుందంటే చాలు అనేక రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లు సోకుతాయి. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ఈ సీజన్లో ముఖ్యంగా దోమలతో వ్యాధులు ప్రబలే ముప్పు ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలం దోమల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుందని, దీంతో డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా వంటి వాటి ముప్పు పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
సకాలంలో చికిత్స అందించాలని, లేకుంటే మరణాలు సంభవించే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అందుకే దోమలతో వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని జాగ్రత్తలు పాటించి డెంగ్యూ, చికున్ గున్యా వంటి వాటి బారినపడకుండా కాపాడుకోవచ్చని చెబుతున్నారు. ఇందులో భాగంగా ముఖ్యంగా దోమల ఉత్పత్తిని అరికట్టడం చాలా ముఖ్యమైందని, అదే సమయంలో విష జ్వరాల బారినపడ్డ వారు ప్రత్యేకంగా చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
దోమల వల్ల వచ్చే వ్యాధులను నివారించేందుకు స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలని, తద్వారా విష జ్వరాల బారినపడకుండా కాపాడుకోవచ్చని పేర్కొంటున్నారు. పడుకునే సమయంలో దోమ తెరలను ఉపయోగించాలి. దోమ తెరల వినియోగంతో దోమల కాటును నివారించవచ్చు. నిపుణులు దోమ తెరల వాడకాన్ని అత్యంత ప్రభావవంతమైన పరిష్కారంగా భావిస్తారు.
మురుగు నీరు నిల్వ ఉన్న చోట దోమలు తమ సంతానోత్పత్తిని చేస్తాయి. ఈ నేపథ్యంలో ఇంట్లో, ఇంటి పరిసరాల్లో మురుగు నీరు నిలువ లేకుండా చూసుకోవాలి. పూల కుండీలు, సెప్టిక్ ట్యాంకుల వద్ద, కూలర్లలో ఉండే నీటిని ఎప్పటికప్పుడు మార్చాలి. దోమలు ఎల్లప్పుడూ నిల్వ ఉన్న నీటిలోనే సంతానోత్పత్తి చేస్తాయి.
కాబట్టి నీటి నిల్వలను నియంత్రిస్తే.. డెంగ్యూ, చికున్‌గున్యాతో పాటు విష జ్వరాల బారినపడకుండా కాపాడుకోవచ్చు. దోమలు కుట్టకుండా ఉండేందుకు ఫుల్ స్లీవ్ ప్యాంట్, షర్టులు ధరించాలి. వీలైనంత వరకు శరీరాన్ని కప్పి ఉంచేలా బట్టలు వేసుకోవాలి. దీంతో దోమలు కుట్టకుండా ఉంటాయి. అదే సమయంలో దోమల బారిన పడకుండా ఉండేందుకు లేత రంగు దుస్తులు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
డెంగ్యూ, చికున్ గున్యా లక్షణాలను గుర్తించి సకాలంలో చికిత్స అందించడం చాలా అవసరం. పెద్దల్లో లక్షణాలు సాధారణంగా దోమ కాటు తర్వాత నాలుగు నుంచి ఐదు రోజలు తర్వాత కనిపిస్తాయి. డెంగ్యూ సోకితే అధిక జ్వరం, తలనొప్పి, వికారం, వాంతులు, చర్మంపై దద్దుర్లు తదితర లక్షణాలు కనిపిస్తాయి.
చాలా మంది ఒకటి, రెండు వారాల్లో జ్వరం నుంచి కోలుకుంటారు. రోగ నిరోధకశక్తి బలహీనంగా ఉంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లక్షణాలు గుర్తించిన సమయంలో వైద్య సహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు.