DASH Diet For High BP | శరీరంలో సోడియం స్థాయిలు అధికంగా ఉంటే దాన్ని బయటకు పంపేందుకు శరీరం శ్రమిస్తుంది. దీంతో రక్త నాళాల గోడలపై పీడనం పెరుగుతుంది. దీన్నే రక్తపోటు లేదా హైబీపీ అంటారు. హైబీపీ వచ్చేందుకు ఇది మాత్రమే కాకుండా పలు ఇతర కారణాలు కూడా ఉంటాయి. శారీరక శ్రమ లేకపోవడం, గంటల తరబడి కూర్చుని పనిచేయడం, జంక్ ఫుడ్ తినడం, రాత్రి పూట నిద్ర సరిగ్గా లేకపోవడం, కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉండడం, ఒత్తిడి ఎక్కువగా ఉండడం వంటి అనేక కారణాల వల్ల బీపీ పెరుగుతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం చాలా మంది చిన్న వయస్సులో ఉన్నవారు కూడా బీపీ బారిన పడుతున్నారు. అయితే హైబీపీ ఉన్నవారు డాక్టర్ ఇచ్చే మందులను వాడడంతోపాటు DASH అనే ఒక రకం డైట్‌ను పాటించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. Dietary Approaches to Stop Hypertension అని పిలవబడే ఈ డ్యాష్ డైట్‌ను పాటిస్తే బీపీ నియంత్రణలో ఉండడంతోపాటు గుండె ఆరోగ్యంగా ఉంటుందని వారు చెబుతున్నారు.
డ్యాష్ డైట్లో భాగంగా పండ్లు, కూరగాయలను అధికంగా తినాల్సి ఉంటుంది. వీటిల్లో పొటాషియం, మెగ్నిషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి బీపీ అదుపులో ఉండేలా చూస్తాయి. పాలకూర, కొత్తిమీర, పుదీనా, బ్రోకలీ, క్యారెట్లు, టొమాటోలు, చిలగడ దుంపలు, ఆలుగడ్డలు (పొట్టుతో), బీట్రూట్ వంటి కూరగాయలను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిని సాధ్యమైనంత వరకు పచ్చిగా తినే ప్రయత్నం చేయాలి. లేదా ఉడికించి తినవచ్చు. అలాగే అరటి పండ్లు, నారింజ, పుచ్చకాయ, తర్బూజా, బెర్రీలు, అవకాడోలు, డ్రై యాప్రికాట్స్, దానిమ్మ పండ్లు వంటి పండ్లను కూడా రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది.
తృణ ధాన్యాలను రోజూ తినడం వల్ల ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. హోల్ వీట్ బ్రెడ్, బ్రౌన్ రైస్, ఓట్స్, కినోవా, హోల్ వీట్ పాస్తా, బార్లీ వంటి ఆహారాలను రోజూ తింటుంటే బీపీ అదుపులో ఉంటుంది. శాచురేటెడ్ కొవ్వులు తక్కువగా ఉండే మాంసాహారలను తింటుండాలి. ఫ్యాటీ ఫిష్‌లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. మంచి నీటి చేపలు లేదా సముద్రపు చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. సాల్మన్, మాకరెల్, ట్యూనా వంటి చేపల్లో ఈ పోషకాలు మనకు అధికంగా లభిస్తాయి. అందువల్ల చేపలను వారంలో కనీసం 2 నుంచి 3 సార్లు తింటుంటే ఎంతో మేలు జరుగుతుంది. బీపీ అదుపులో ఉండడంతోపాటు గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
చికెన్ తినాలనుకుంటే తప్పనిసరిగా స్కిన్‌ను తీసేసి తినాలి. అలాగే పప్పు దినుసులను ఆహారంలో భాగం చేసుకోవాలి. బ్లాక్ బీన్స్, రాజ్మా, నల్ల శనగలు, సోయా బీన్ లను తినాలి. వీటిల్లో పైబర్, పొటాషియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. బాదంపప్పు, జీడిపప్పు, వాల్ నట్స్, అవిసె గింజలు, చియా విత్తనాలు, గుమ్మడికాయ విత్తనాలను కూడా తినవచ్చు. వీటిల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఇవి రక్త సరఫరాను మెరుగు పరిచి బీపీ అదుపులో ఉండేలా చేస్తాయి. హైబీపీ ఉన్నవారు కొవ్వు తీసిన పాలు, మజ్జిగను తీసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్‌ను వంటల్లో భాగం చేసుకుంటున్నా కూడా బీపీ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను తింటుంటే రక్త సరఫరా మెరుగు పడి బీపీ అదుపులో ఉంటుంది. ఇలా డ్యాష్ డైట్‌ను పాటిస్తుంటే హైబీపీ ఉన్నవారు తమ బీపీని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా సురక్షితంగా ఉంటారు.