శ్రావణం వెళ్లింది. భాద్రపదం వచ్చింది. వినాయకుడి పాలవెల్లికి పచ్చిగా వేలాడే సీతాఫలాలు… మళ్లీ వారానికల్లా తియ్యగా మారి నోరూరిస్తాయి. మధుర ఫలం అన్నపేరు మామిడి తర్వాత సీతాఫలానికే ఇవ్వాలన్నది ఈ పండు అభిమానుల డిమాండ్. ఇంకోమాట చెప్పాలంటే రెంటికి రెండూ మధుర ఫలాలే… అంటారు కూడా. లోపల నలుపు తెలుపులో కనిపించే ఈ పండు ప్రయోజనాలు మాత్రం హోళీ రంగులంత వైవిధ్యం.
Custard Apple | ఆరోగ్యం చెట్లకు కాస్తుందా… మనం సంపాదించుకోవాలిగానీ అన్నమాట మనకు నిజమే అనిపిస్తుంది. కానీ, సీతాఫలం విషయంలో మాత్రం దీన్ని కాస్త సడలించవచ్చు. నిజంగా చెట్టుకు తెంచుకు తిని ఆరోగ్యాన్ని సంపాదించుకునేలా బోలెడు పోషకాలు ఉన్నాయిందులో. యవ్వనంగా కనిపించేందుకు, రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు, క్యాన్సర్లను నివారించేందుకు, ఒత్తిడిని చిత్తు చేసేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది.