మన రోజువారీ ఆహారంలో అనాదిగా వాడుకలో ఉన్న పాల ఉత్పత్తి పెరుగు. ఇంట్లో తోడుపెట్టుకుని తయారు చేసుకున్న పెరుగుతో శరీరానికి ఒనగూరే ప్రయోజనాలు ఎన్నో. అంతేకాదు, చర్మం, వెంట్రుకల ఆరోగ్యానికి పెరుగు గొప్ప ఉపకారి. పెరుగు రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఎముకలు, దంతాలను పటిష్ఠం చేస్తుంది. శరీర బరువు సమతూకంలో ఉండటానికి రోజువారీ ఆహారంలో పెరుగును భాగం చేసుకుంటే మంచిది.
పాల నుంచి వచ్చే ఉప ఉత్పత్తి పెరుగు. కాబట్టి, ఇందులో కాల్షియం, విటమిన్ బి-2, విటమిన్ బి-12, పొటాషియం, మెగ్నీషియం లాంటి ఎన్నో అత్యవసరమైన పోషకాలు ఉంటాయి. పైగా పాలకంటే కూడా సులువుగా అరిగిపోతుంది.
సజీవ బ్యాక్టీరియా సమృద్ధంగా ఉండే పెరుగు గొప్ప ప్రొబయోటిక్ ఆహారం. ఇది మంచి బ్యాక్టీరియా కావడంతో పేగుల పనితీరు మెరుగుపడటానికి, మంటగా ఉన్న జీర్ణవ్యవస్థ చల్లబడటానికి, గడబిడగా ఉన్న కడుపును శాంతపరచడానికి ఎంతో ఉపకరిస్తుంది. పెరుగులో ఉండే సజీవ బ్యాక్టీరియా వ్యాధికారక క్రిములతో పోరాడుతుంది. అలా పొట్ట ఆరోగ్యానికి హామీగా ఉంటుంది.
పెరుగు చర్మంపై మాయిశ్చరైజింగ్ ప్రభావాన్ని చూపిస్తుంది. పొడిబారిన చర్మానికి సహజసిద్ధంగా తేమనిస్తుంది. పొటాషియం, మెగ్నీషియం లాంటి పోషకాలు సహా పెరుగులో ఉండే ప్రత్యేకమైన ప్రొటీన్లు అధిక రక్తపోటును తగ్గించడంలో సాయపడతాయి. గుండె ఆరోగ్యానికి భరోసాను ఇస్తాయి.
శరీర బరువును తగ్గించుకునేందుకు పెరుగు రెండు విధాలుగా ఉపకరిస్తుంది. ఒకటి, రక్తంలో పేరుకుపోయిన కార్టిసోల్ స్థాయిని తగ్గిస్తుంది.
మన శరీరంలో పొట్ట, గుండె చుట్టూ కొవ్వు పేరుకుపోయేలా చేసే హార్మోన్ కార్టిసోల్. రెండోది, మనకు జంక్ ఫుడ్ అంటే ఉవ్విళ్లూరడాన్ని తగ్గిస్తుంది.
అలా మన డైట్‌పై దృష్టి సారించేలా చేస్తుంది.
పెరుగులో కాల్షియం, ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన దంతాలు, ఎముకలు దృఢంగా ఉండటానికి దోహదపడతాయి.
పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. ఇది ఫంగస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. కాబట్టి, పెరుగును హెన్నాతో కలిపి మాడుకు పట్టిస్తే చుండ్రును అరికట్టవచ్చు. అంతేకాదు పెరుగు హెయిర్ కండిషనర్‌గా కూడా పనిచేస్తుంది.
విటమిన్లు, ఖనిజ లవణాలు పెరుగులో పుష్కలం. అలా ఇది మనకు తేలిగ్గా దొరికే మంచి శక్తి వనరు. పైగా యాంటి ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.
రోజువారీ పనిభారం నుంచి త్వరగా తేరుకునేందుకు ఉపకరిస్తుంది.
తాజా పండ్లు, లేదంటే అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలను కలిపిన ఒక కప్పు పెరుగు మనకు మరింత ఫైబర్, ఇతర పోషకాలను అందిస్తుంది.
పండ్లు, తరిగిన ఉల్లిపాయలు, టమాటాలు, స్మూతీలలో కలపడం, కూరలకు మంచి రంగు వచ్చేలా చేయడానికి, రోజువారీ ఉపాహారాన్ని సంపూర్ణం చేసుకోవడానికి పెరుగు మంచి ఆహార పదార్థం.