న్యూఢిల్లీ : చైనాలో కరోనా వైరస్ కేసులు వెల్లువెత్తడంతో ఇన్ఫెక్షన్తో పోరాడేందుకు సహజసిద్ధ పరిష్కారాల వైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. కరోనా కేసులు ప్రబలుతున్న నేపధ్యంలో దేశవ్యాప్తంగా నిమ్మకాయలు, సిట్రస్ పండ్లు, పియర్స్ అమ్మకాలు ఊపందుకున్నాయి. బీజింగ్, షాంఘై నగరాల్లో ప్రజలు నిమ్మకాయలను విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. ఈ రెండు నగరాల్లో కొవిడ్-19 కేసులు అధికంగా నమోదవుతున్నాయి.
ఇమ్యూనిటీని పెంచుకునేందుకు ప్రజలు విటమిన్ సీ అధికంగా ఉండే ఆహారాన్ని కొనుగోలు చేస్తున్నారు. విటమిన్ సీ కరోనా వైరస్‌ను నయం చేస్తుందని అధికారికంగా ఎలాంటి రిపోర్ట్స్, ఆధారాలు వెల్లడికాకున్నా ప్రజలు రోగనిరోధక శక్తి పెరుగుతుందనే ఉద్దేశంతో విటమిన్ సీ అధికంగా ఉండే ఆహార పదార్ధాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఆకలిని పెంచుతుందని చైనీయులు నమ్మే యల్లో పీచెస్కు కూడా చైనాలో డిమాండ్ పెరిగింది. ఇక జ్వరం, జలుబు, ఫ్లూ తగ్గించే మందులు, పెయిన్‌కిల్లర్స్ అమ్మకాలు కూడా చైనాలో పెరిగాయి. కఠిన నియంత్రణలను సడలించిన అనంతరం చైనాలో కొవిడ్ కేసులు గణనీయంగా పెరిగాయి. చైనాతో పాటు జపాన్, దక్షిణ కొరియా, అమెరికా వంటి దేశాల్లో ఇటీవల కొవిడ్-19 కేసులు పెరుగుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ గణాంకాలు వెల్లడించాయి.