మా బాబుకి రెండు సంవత్సరాల వయసు. డాక్టర్ గారి దగ్గరికి జలుబు, దగ్గు అని వెళ్లినప్పుడు… ఆయన మరో సమస్య ఏదో ఉందని చెప్పారు. దాని కారణంగా ఎకో చేయించమన్నారు. అంతా బాగానే ఉంది కానీ బైకస్పిడ్ అయాటిక్ వాల్వ్ అనే ఇబ్బంది ఉందని అన్నారు. ఇది ప్రమాదం ఏం కాదు కానీ, ఏడాదికోసారి వైద్యులకి చూపించాలని చెప్పారు. అసలేంటీ సమస్య, మాకు ఆందోళనగా ఉంది?
కొంత మంది పిల్లల్లో పుట్టుకతోనే గుండె కవాటాల సమస్య ఉంటుంది. ఎడమవైపు ఉండే కింది గదులు… జఠరికల నుంచి శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని పంపే ధమనిని, అంటే మహా ధమనిని ఇంగ్లీషులో ‘అయోటా’ అంటాం. దాని నుంచి రక్తాన్ని తీసుకువెళ్లడానికి ఉండే కవాటమే అయాటిక్ వాల్వ్. ఇక్కడ నుంచి మూడు మార్గాల్లో తలుపుల వంటి నిర్మాణాల గుండా ప్రధాన రక్తనాళానికి రక్తం సరఫరా అవుతుంది. అయితే ఇది రెండు ద్వారాల గుండా వెళితే అంటే అక్కడ రెండు మార్గాలు మాత్రమే ఉంటే ‘బైకస్పిడ్ అయాటిక్ వాల్వ్’ అంటారు.
ఇలాంటప్పుడు రక్తం ప్రవహించడానికి దారి చిన్నగా ఉండటంకానీ, ఇంకేమైనా ఇతర సమస్యలు దానికి ముడిపడి ఉండే అవకాశం కానీ ఉంటుంది. మీ అబ్బాయి విషయంలో ఇది ఉందా లేదా అన్నది వివరం తెలపలేదు. కేవలం బైకస్పిడ్ అయాటిక్ వాల్వ్ మాత్రమే ఉండి, దానివల్ల ఇబ్బందులు ఏమైనా ఉంటాయా అంటే … కొద్దిపాటి రిస్క్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. అందుకే ప్రతి సంవత్సరం చెకప్ చేయించుకుంటూ, ఆ కవాటం చిన్నగా అవుతున్నదా అన్నది చూసుకుంటూ ఉండాలి. అలా ఏమన్నా జరిగితే దానికి చికిత్స చేయొచ్చు. కాబట్టి కంగారు పడకుండా, క్రమం తప్పకుండా చెకప్‌లు చేయిస్తే సరి!
– డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్