మా బాబు వయసు ఐదేండ్లు. పుట్టినప్పటి నుంచి ఆరోగ్యంగానే ఉన్నాడు. సమయానికి టీకాలు కూడా వేయించాం. చలాకీగా ఉండేవాడు. అయితే, కొద్దివారాలుగా బాబు కొంచెం నీరసంగా ఉంటున్నాడు. ఎప్పుడు చూసినా పడుకుంటున్నాడు. ఎందుకైనా మంచిదని వైద్యుణ్ని సంప్రదించాం. రెండుసార్లు బలానికి సిరప్లు రాసిచ్చారు. కానీ, గతవారం చెకప్ కోసం వెళ్లినప్పుడు.. పలు పరీక్షలు చేసి, బ్లడ్ క్యాన్సర్ ఉందేమోనన్న అనుమానం వ్యక్తంచేశారు. ఆ మాట వినడంతోనే మాకు గుండె ఆగినంత పనైంది. ఇంత చిన్నపిల్లలకు క్యాన్సర్ వస్తుందా? ట్రీట్మెంట్తో ఈ వ్యాధి నయమవుతుందా? మా అబ్బాయి మాకు దక్కుతాడా?
కన్నబిడ్డకు క్యాన్సర్ అని తెలిసినప్పుడు ఏ తల్లిదండ్రులూ తట్టుకోలేరు. మీ బాధను అర్థం చేసుకోగలను. వైద్యులు మీ అబ్బాయికి బ్లడ్ క్యాన్సర్ ఉందని చెప్పారు. అక్యూట్ లుకేమియా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చిన్నపిల్లలకూ క్యాన్సర్ రావొచ్చు. కాకపోతే, ఇప్పుడున్న చికిత్సా విధానాల కారణంగా పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్‌ను పూర్తిగా తగ్గించవచ్చు. అయితే, ముందుగా అది ఏ రకమైన క్యాన్సరో నిర్ధారించాల్సి ఉంటుంది. మీరు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్ (పిల్లల క్యాన్సర్ స్పెషలిస్ట్)ను సంప్రదించండి. వాళ్లు అవసరమైన పరీక్షలు చేయించి, వ్యాధిని నిర్ధారించి.. సరైన చికిత్స అందిస్తారు. వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. అత్యాధునిక చికిత్సా విధానాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో మీ అబ్బాయిని రక్షించుకోవచ్చు. కాకపోతే, చికిత్స రెండేండ్లపాటు కొనసాగవచ్చు.
ఒక క్రమపద్ధతిలో చికిత్స అందిస్తారు. కొన్ని కాంప్లికేషన్స్ కూడా తలెత్తవచ్చు. వాటిని నివారిస్తూ.. చికిత్స ఇస్తారు. వారు చెప్పిన నియమాలకు అనుగుణంగా ట్రీట్మెంట్ ఇప్పించాలి. మొదటిసారి కొద్దిరోజులు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుంది. తర్వాత అవసరానికి తగ్గట్టు వారానికో, రెండువారాలకో, నెలకో మళ్లీ సంప్రదించాల్సి ఉంటుంది. మొదట్లో తరచుగా వైద్యులను సంప్రదించాలి. తర్వాత్తర్వాత అడపాదడపా వెళ్లాల్సి ఉంటుంది. వైద్యులు సూచించిన పరీక్షలు చేయిస్తూ, చికిత్స తీసుకుంటే మీ అబ్బాయికి వ్యాధి పూర్తిగా నయమవుతుంది. ప్రస్తుతం కొన్ని ప్రభుత్వ దవాఖానల్లోనూ ఈ చికిత్స అందుబాటులో ఉంది. ఉదాహరణకు ఎం.ఎన్.జె ఆస్పత్రిలో పిల్లల క్యాన్సర్‌కు చికిత్స అందిస్తున్నారు. మీ వసతులు, పరిస్థితులకు అనుగుణంగా, క్యాన్సర్ స్పెషలిస్ట్ సూచనలు పాటిస్తూ నాణ్యమైన చికిత్స తీసుకోగలరని సలహా.
– డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్