మా బాబు వయసు మూడు సంవత్సరాలు. హుషారుగానే ఆడుకుంటాడు. ఇంతకుముందు ఎటువంటి ఆరోగ్య సమస్యలూ లేవు. అందరిలానే పరుగెత్తుతాడు, మాట్లాడతాడు. కానీ, వారం రోజులుగా తన నడకలో మార్పు కనిపిస్తున్నది. ఎందుకో కుంటుతున్నాడు. డాక్టర్కి చూపిస్తే.. నొప్పి ఉందని, కొన్ని నొప్పి తగ్గించే మందులు ఇచ్చారు. అవి వాడినా తగ్గలేదు. ఇప్పుడు ఏ వైద్యుడిని సంప్రదించాలి?
మూడు సంవత్సరాల వయసు పిల్లలు చాలా హుషారుగా ఉంటారు. బాగా గెంతుతూ ఉంటారు. కుంటిగా నడవడం, నడకలో తేడా వచ్చిందంటే లోపల ఏదో సమస్య ఉండే ఉంటుంది. మీరు ఇప్పటికే వైద్యులకు చూపించామని చెబుతున్నారు. కానీ, ఏ డాక్టర్ అన్నది వివరించలేదు. పిల్లల వైద్యులతో తప్పని సరిగా చికిత్స చేయించాలి. ఎటువంటి గాయం లేకుండా, దెబ్బ కనిపించకుండా ఉన్నా.. పెద్దలు చూడనప్పుడు కిందపడి గాయపడవచ్చు. అవి కనిపించకపోవచ్చు. అందువల్ల నొప్పి, నడకలో మార్పు వస్తుంది.
అలాంటి నొప్పి రెండు, మూడు రోజుల్లో సాధారణంగా తగ్గిపోవాలి. కొన్నిసార్లు జాయింట్స్ (కీళ్ల)లో, ఎముకలో, కండరాల్లో ఇన్ఫెక్షన్ ఉన్నా నొప్పి కలగడం, నడకలో మార్పు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ ఉంటే జ్వరం వస్తుంది. బిడ్డ హుషారుగా ఉండకపోవడం, రోజూ ఆడినట్టుగా ఆడకపోవడం జరుగుతుంది. కొన్నిసార్లు వారం, రెండు వారాలపాటు ఇన్ఫెక్షన్ ఉంటే కీళ్లలో నీరు చేరుతుంది. తుంటి ఎముక కీళ్లలో ఎక్కువగా ఈ సమస్య వస్తుంది. ఈ ఇబ్బంది దానికదే తగ్గిపోతుంది. కొద్దిగా నొప్పి, కుంటుతూ నడవడం కనిపిస్తాయి. ఏది ఏమైనా, పిల్లల డాక్టర్, కుదిరితే పిల్లల ఎముకల డాక్టర్కి చూపిస్తే మంచిది. అవసరమైన ఎక్స్రే, స్కాన్, రక్తపరీక్షలు చేయించాలి. ఆ తర్వాత వైద్యుల సలహాలు పాటించాలి.
– డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్