ఎవరైనా సరే, కంప్యూటర్ మీద వరుసగా ఆరు గంటలకు మించి పనిచేయలేరు. పనిచేసినా కళ్లు ఒత్తిడికి గురవుతాయి. అదనంగా వాట్సాప్ చాటింగ్, ఓటీటీ వెబ్‌సిరీస్.. అన్నీ కలిసి కళ్లకు పరీక్ష పెడతాయి. నేత్రాలను ఒత్తిడికి గురిచేస్తాయి. దృష్టితో ముడిపడిన నరాలు దెబ్బతింటాయి. దీంతో కంట్లో దురద, నొప్పి, అస్పష్టమైన చూపు, ధారాపాతంగా నీళ్లు కారడం.. తదితర సమస్యలు పుట్టుకొస్తాయి. బండికి ఇంధనంలా.. కంటికి శక్తినిచ్చే కొన్ని పానీయాలు ఆ సమయంలో బలాన్ని ఇస్తాయి.
సగం గ్లాసు క్యారెట్ జ్యూస్‌లో, టేబుల్ స్పూన్ తేనె కలుపుకొని తాగితే తప్పక ఉపశమనం లభిస్తుంది. ఈ మిశ్రమంలో విటమిన్-ఎ, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలం. ఈ రెండూ కంటి ఆరోగ్యానికి మంచి చేసేవే. కళ్లు పొడిబారకుండా, ఎర్రబారకుండా అడ్డుకుంటాయి. తేమను ప్రసాదిస్తాయి. రోజూ బ్రేక్‌ఫాస్ట్‌కు ముందు తీసుకుంటే సరిపోతుంది. కనీసం రెండు నెలలు ఈ అలవాటు కొనసాగించాలని చెబుతారు నిపుణులు.