శరీరంలోకి క్యాన్సర్ ప్రవేశించిందంటే ఇక మరణ శాసనమే. ఎన్ని అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి
వచ్చినా అవన్నీ తాత్కాలిక ఉపశమనమే అందిస్తున్నాయి. ఈ క్యాన్సర్ వ్యాధులను ప్రారంభ దశలో గుర్తించి, సరైన చికిత్స అందిస్తే రోగం ముదరకుండా నియంత్రించవచ్చు. కానీ, శరీరంలో నుంచి పూర్తిగా నిర్మూలించలేం. ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్ వ్యాధుల విషయానికి వస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సల ద్వారా వ్యాధులను కొంత వరకు మాత్రమే నియంత్రించవచ్చు.
ఒకసారి చికిత్స అందించిన తర్వాత క్యాన్సర్ వ్యాధి మళ్లీ మళ్లీ తిరగబడే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి రోగులకు కార్-టి సెల్ థెరపితో చెక్ పెట్టవచ్చంటున్నారు క్యాన్సర్ వైద్యనిపుణులు. క్యాన్సర్ చికిత్స తరువాత మళ్లీ వ్యాధి తిరగబడిన రోగులకు ఈ చికిత్సా విధానం ద్వారా జీవిత కాలాన్ని పెంచవచ్చు అని భరోసా ఇస్తున్నారు. అసలు ఈ కార్-టి సెల్ థెరపీ అంటే ఏంటి? ఈ చికిత్సా విధానంతో ఏయే క్యాన్సర్ రోగులకు చికిత్స అందించవచ్చు ? ఈ చికిత్స ద్వారా రోగులకు ఆరోగ్యపరంగా కలిగే లాభాలేంటి? తదితర అంశాలను నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
ప్రస్తుతం భారత్‌లో కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్లకు మాత్రమే కార్-టి సెల్ థెరపీతో చికిత్స అందించేందుకు అనుమతి ఉంది. మిగిలిన బ్లడ్ క్యాన్సర్లకు సంబంధించి ఇంకా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. బ్లడ్ క్యాన్సర్లను పరిశీలిస్తే ప్రధానంగా ఇవి రెండు రకాలు. ఒకటి లింఫోమా కాగా, రెండోది లుకేమియా క్యాన్సర్.
1. హాడ్కిన్ లింఫోమా
2.నాన్-హాడ్కిన్ లింఫోమా
ఈ నాన్ హాడ్కిన్ లింఫోమాలో మళ్లీ రెండు రకాల క్యాన్సర్స్ ఉన్నాయి. అందులో 1. బి-నాన్ హాడ్కిన్ లింఫోమా 2. టి-నాన్ హాడ్కిన్ లింఫోమా.
లుకేమియా క్యాన్సర్స్ రెండు రకాలు. అందులో 1.అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా (ఏఎల్ఎల్). 2.అక్యూట్ మైలాయిడ్ లుకేమియా
1. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియాలో మళ్లీ రెండు రకాలు ఉన్నాయి. అవి బి-అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా, టి-అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా. అయితే ప్రస్తుతం మన దేశంలో కార్-టి సెల్ థెరపీతో అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియాకు చెందిన బి-అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా (బి-ఏఎల్ఎల్), లింఫోమా క్యాన్సర్‌కు చెందిన బి-నాన్ హాడ్కిన్ లింఫోమా (బి-ఎన్హెచ్ఎల్) క్యాన్సర్ వ్యాధులకు మాత్రమే చికిత్స అందుబాటులో ఉంది.
చైమరిక్ యాంటీజెన్ రిసెప్టర్- టి సెల్ థెరపీ (కార్-టి సెల్ థెరపీ).. దీనినే జీన్ థెరపీ అని కూడా అంటారు. ఈ విధానంలో రోగిలోని క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా రోగి ఇమ్యూనిటీని (టీ-సెల్స్) ఉత్తేజితపరిచి వాటిని తిరిగి రోగికి ఎక్కిస్తారు. అంటే ఇమ్యూనిటీలో జన్యుమార్పిడి చేస్తారన్నమాట. ప్రస్తుతం ఈ కార్-టి సెల్ థెరపీతో బి-అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా (బి-ఏఎల్ఎల్), బి-నాన్ హాడ్కిన్ లింఫోమా (బి-ఎన్హెచ్ఎల్) వంటి రక్త క్యాన్సర్లకు చెక్ పెట్టవచ్చు.
అతి ఖరీదైన ఈ కార్-టి సెల్ థెరపీని మన దేశంలో అతి తక్కువ ఖర్చుతో అందిస్తున్నారు. అమెరికా, యూరప్ దేశాల్లో ఈ చికిత్సకు సుమారు 4 లక్షల డాలర్లకు పైగా అంటే దాదాపు రూ.3.5 కోట్లు ఖర్చవుతుంది. అయితే భారత్‌లో మాత్రం రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల మధ్య ఖర్చవుతుంది. దేశీయ పరిశోధనలు, స్థానిక తయారీ, సరళమైన ప్రక్రియల కారణంగా విదేశాల కంటే మన దేశంలో అతి తక్కువ ఖర్చుతో కార్-టి సెల్ థెరపీ చికిత్స అందుబాటులో ఉంది.
2023 అక్టోబర్‌లో ఇమ్యునోక్ట్ (ఐఐటి బాంబేలో ఇన్యూబేటెడ్ స్టార్టప్), టాటా మెమోరియల్ సెంటర్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన నెక్స్ కార్19కు దేశంలో తొలి దేశీయ కార్-టి సెల్ థెరపీ చికిత్సగా అనుమతి లభించింది. పునరావృతమైన అంటే చికిత్స అందించిన తరువాత మళ్లీ తిరగబడిన, సంప్రదాయ చికిత్సలకు లొంగని బి-ఏఎల్ఎల్, బి-ఎన్హెచ్ఎల్ క్యాన్సర్‌తో బాధపడే రోగులకు ఈ కార్-టి సెల్ థెరపితో చెక్ పెట్టవచ్చు.
2025 జనవరిలో ఇమ్యూనీల్ థెరప్యూటిక్స్ అభివృద్ధి చేసిన ‘క్వార్టెమీ’ అనే చికిత్సా పద్ధతికి అనుమతి లభించింది. ఈ పద్ధతి ద్వారా పెద్దవారిలో వచ్చే బి-ఎన్హెచ్ఎల్ వ్యాధిగ్రస్తులకు చికిత్స చేయవచ్చు. ఈ చికిత్సపై నిర్వహించిన ఫేజ్-2 క్లినికల్ ట్రయల్స్‌లో 83.3 శాతం స్పందన
కనిపించింది.
భారత్‌లో నిర్వహించిన క్లినికల్ అధ్యయనాల్లో కార్-టి చికిత్సకు 70 నుంచి 80 శాతం పైగా స్పందన రేటు నమోదైంది. పాత సంప్రదాయ చికిత్సలతో కేవలం 10- 20 శాతం మాత్రమే స్పందన కనిపించింది. అందుకని పాత చికిత్సా పద్ధతుల కంటే కార్-టి సెల్ థెరపీ అత్యంత మెరుగైన చికిత్సా విధానంగా చెప్పవచ్చు. స్థానికంగా అభివృద్ధి చేసిన ‘హ్యూమనైజ్డ్ కార్-టి డిజైన్’ వల్ల సైటోకైన్ రిలీస్ సిండ్రోమ్ వంటి
తీవ్రమైన దుష్ప్రభావాలు కూడా తగ్గాయి.
ఇప్పటికే మల్టిపుల్ మైలోమా వంటి బ్లడ్ క్యాన్సర్లలో మూల కారకమైన బీసీఎంఏకు లక్ష్యంగా అందిస్తున్న కార్-టి సెల్ చికిత్సలు భారత్‌లో క్లినికల్ ట్రయల్ దశలో ఉన్నాయి. వీటికి సంబంధించిన ప్రాథమిక ఫలితాలు విజయవంతంగా రావడంతో మల్టిపుల్ మైలోమా రోగుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. త్వరలోనే ఈ వ్యాధికి కూడా కార్-టి సెల్ థెరపీ చికిత్స అందించేందుకు అనుమతి లభించనుంది.
డాక్టర్ బోయెల్లా పవన్ కుమార్ ,సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ అపోలో హాస్పిటల్ జూబ్లీహిల్స్, హైదరాబాద్
-మహేశ్వర్‌రావు బండారి