క్యాన్సర్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా క్యాన్సర్ మహమ్మారి అందర్నీ ప్రమాదంలోకి నెట్టేస్తున్నది. అయితే క్యాన్సర్ లక్షణాలను ముందుగానే గుర్తిస్తే ప్రమాదాన్ని తగ్గించొచ్చు. సరైన సమయంలో వైద్యం తీసుకుంటే ప్రాణాపాయస్థితి నుంచి బయటపడి, సాధారణ జీవితం గడపొచ్చు. చాలామంది క్యాన్సర్ లక్షణాలపై అవగాహన లేక సమస్యను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ పది లక్షణాలను గమనించి, వెంటనే వైద్యుణ్ని సంప్రదిస్తే.. ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించవచ్చు.
అకస్మాత్తుగా బరువు తగ్గడం: ఒకే నెలలో నాలుగైదు కిలోలు తగ్గుతున్నారంటే జాగ్రత్త పడాలి. కిలోల కొద్దీ బరువు ఒకేసారి తగ్గితే, అది కడుపు, అన్నవాహిక, ఊపిరితిత్తులు, క్లోమ క్యాన్సర్ లక్షణం కావచ్చు.
ఎక్కువ అలసట: చిన్నచిన్న పనులకే ఎక్కువగా అలసిపోతున్నా, అది క్యాన్సర్ లక్షణం కావచ్చు. లుకేమియా లేదా లింఫోమా వంటి బ్లడ్ క్యాన్సర్లలో కూడా ఈ లక్షణం ఉంటుంది.
కణుతులు: మెడ, చంక మొదలైన చోట్ల కొత్తగా గడ్డలు కనిపించినా, లేదా చిన్న గడ్డలు గట్టిపడినా, పెద్దగా పెరిగినా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. అది రొమ్ము, వృషణాలు, శోషరస సంబంధిత క్యాన్సర్ కావచ్చు.
చర్మం-పుట్టుమచ్చల్లో మార్పు: కొత్త పుట్టుమచ్చలు పుట్టుకురావడం, పాత మచ్చల రంగు, పరిమాణంలో మార్పులు, వాటిలోంచి రక్తం రావడం లాంటివి క్యాన్సర్ లక్షణాలుగా చెబుతారు. అందుకే చర్మ సమస్యలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దు.
బ్లీడింగ్ ప్రమాదమే: మూత్రం, మలం, వాంతి, దగ్గులో రక్తం కనిపిస్తే, వెంటనే అప్రమత్తం అవ్వాలి. అవన్నీ మూత్రాశయ, పెద్దపేగు, కడుపు, ఊపిరితిత్తుల క్యాన్సర్కు దారితీసే అవకాశాలు ఉంటాయి.
ఆగని దగ్గు: వారాలు గడిచినా దగ్గు తగ్గకుండా, రక్తం పడుతున్నట్లయితే అది కేవలం ఇన్ఫెక్షన్ కాకపోవచ్చు. గొంతు, ఊపిరితిత్తులు, థైరాయిడ్ క్యాన్సర్కు సూచన అనుకొని జాగ్రత్తపడటం మంచిది.
అజీర్తి-మింగడంలో ఇబ్బంది: ఆహారం మింగడంలో ఇబ్బందిగా ఉన్నా, ఛాతీలో మంట, అజీర్తి సమస్యలు దీర్ఘకాలంగా ఉంటే, వెంటనే అప్రమత్తం అవ్వాలి. అది గొంతు, కడుపు, అన్నవాహిక క్యాన్సర్కు దారితీయొచ్చు.
విసర్జన వేళల్లో మార్పులు: మల విసర్జన సమయాల్లో మార్పులు, అతిసారం, మలబద్ధకం, మలంలో రక్తం, మూత్రంలో మంట మొదలైనవి మూత్రాశయ, పెద్దపేగు, వీర్యగ్రంథి క్యాన్సర్ లక్షణాలు. వీటిలో ఏవి ఎక్కువ రోజులున్నా డాక్టర్ను సంప్రదించాలి.
విపరీతమైన నొప్పి: ఎముకలు, క్లోమం, అండాశయాల్లో క్యాన్సర్ ఉన్నప్పుడు.. కడుపు, వీపు లేదా కీళ్లలో నొప్పి విపరీతంగా ఉంటుంది. రోజులు గడిచినా ట్యాబ్లెట్లతో తగ్గకుంటే, వైద్యుణ్ని కలవడం అవసరం.
రాత్రుళ్లు చెమటలు: తరచూ జ్వరం, రాత్రుళ్లు చెమటలు పట్టడం, వరుసగా ఇన్ఫెక్షన్లు లాంటివి కూడా క్యాన్సర్ లక్షణాలు అయ్యుండొచ్చు. ఈ లక్షణాలు కనిపించినంత మాత్రాన కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇవి దీర్ఘకాలం కొనసాగితే మాత్రం జాగ్రత్తపడటం తప్పనిసరి. కీడెంచి మేలెంచడం మంచిది కదా! ఈ తరహా లక్షణాలు వారాల తరబడి అలాగే కొనసాగుతూ ఉంటే.. వైద్యుణ్ని సంప్రదించడం తప్పనిసరి. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకోకుండా ఉంటుంది.