Lotus Seeds | థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా హైపోథైరాయిడిజం ఉన్నవారిలో జీవక్రియ మందగించడం, బరువు పెరగడం, అలసట వంటి సమస్యలు కనిపిస్తాయి. మరోవైపు హైపర్‌థైరాయిడిజంలో జీవక్రియ వేగంగా పనిచేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన చిరుతిండిగా మఖానాను తీసుకోవచ్చా అనే సందేహం చాలామందికి ఉంటుంది. మఖానాను ఫాక్స్ నట్స్ లేదా లోటస్ సీడ్స్ అని కూడా పిలుస్తారు. సరిగ్గా తయారు చేసి, పరిమితంగా తీసుకుంటే థైరాయిడ్ సమస్యలు ఉన్నవారికి ఇది మంచి చిరుతిండిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
థైరాయిడ్ ఆరోగ్యంపై ప్రభావం చూపే గోయిట్రోజెనిక్ పదార్థాలు కొన్ని ఆహారాల్లో ఉంటాయి. ఇవి శరీరంలో అయోడిన్ వినియోగాన్ని ప్రభావితం చేసి థైరాయిడ్ హార్మోన్ల తయారీపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అయితే మఖానా గోయిట్రోజెనిక్ ఆహారం కాదని ,అందువల్ల థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు మఖానాను పూర్తిగా దూరంగా పెట్టాల్సిన అవసరం లేదని వారు తెలియజేస్తున్నారు. అలాగే 30 గ్రాముల మఖానాలో 110 కేలరీల కంటే తక్కువ శక్తి లభిస్తుంది. ఇందులోని పీచు, సంక్లిష్ట కార్బొహైడ్రేట్లు ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగించడంలో సహాయపడతాయి. దీంతో అనారోగ్యకరమైన చిరుతిండ్లకు దూరంగా ఉండేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
మఖానాలో మెగ్నిషియం, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి శరీరంలోని వివిధ జీవక్రియలకు, ఎముకల ఆరోగ్యానికి, మొత్తం పోషక సమతుల్యతకు ఉపయోగపడతాయి. అలాగే మఖానాలో ఉండే కొన్ని యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులోని పీచు జీర్ణవ్యవస్థలోని మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు తోడ్పడుతుంది. అయితే మఖానాను థైరాయిడ్ వ్యాధికి చికిత్సగా భావించకూడదు. దీన్ని సమతుల్య ఆహారంలో ఒక భాగంగా మాత్రమే తీసుకోవాలి.
మఖానాను పొడిగా వేయించి, కొద్దిగా నెయ్యి లేదా కొబ్బరి నూనె, తక్కువ మోతాదులో ఉప్పుతో తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. అధిక నూనె, ఉప్పు, చక్కెరలు లేదా కృత్రిమ రుచులు కలిగిన ప్యాకేజ్డ్ మఖానాను తరచూ తీసుకోకపోవడం మంచిది. బాదం, వాల్నట్స్ లేదా గుమ్మడి గింజలతో కలిపి తీసుకుంటే పోషక విలువ పెరుగుతుంది. ముఖ్యంగా థైరాయిడ్ మందులు, థైరాక్సిన్, తీసుకునేవారు మందు వేసుకున్న వెంటనే మఖానాతో పాటు ఏ ఆహారాన్నీ తీసుకోకూడదు. మందు శరీరంలో సరిగ్గా శోషించేందుకు సాధారణంగా ఖాళీ కడుపుతో తీసుకోవాలని, ఆహారానికి తగినంత సమయం ఇవ్వాలని సూచిస్తున్నారు. మందుల సమయంపై మాత్రం వైద్యుల సూచనలను పాటించడం ముఖ్యమని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు.