ఇప్పుడు మన జీవితాల్ని స్క్రీన్లు శాసిస్తున్నాయి. రోజులో చాలా సమయంపాటు ఫోన్లు, ట్యాబ్స్, కంప్యూటర్లు, టీవీలు చూడటం అలవాటుగా మారిపోయింది. అయితే, ఎక్కువ కాలంపాటు స్క్రీన్లకు అతుక్కుపోవడం క్యాన్సర్ ముప్పును పెంచుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. స్క్రీన్ టైమ్‌కు, క్యాన్సర్‌కు ఏదైనా సంబంధం ఉందేమోనని పలు విద్యా సంస్థల పరిశోధకులు అధ్యయనం చేశారు. క్యాన్సర్ ముప్పు పెరగడానికి డిజిటల్ గ్యాడ్జెట్ల తెరల నుంచి వెలువడే బ్లూ లైట్ ప్రధాన కారణం కావచ్చని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బ్లూ లైట్ మన నాణ్యమైన నిద్రకు అవసరమైన మెలటోనిన్ హార్మోన్ విడుదలను తగ్గిస్తుందట. దీంతో రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టదు. రొమ్ము, పెద్దపేగు, ప్రొస్టేట్ క్యాన్సర్ సహా వివిధ క్యాన్సర్లకు నిద్ర లేమికి సంబంధం ఉంటుంది. అయితే, స్క్రీన్లను ఎక్కువ సేపు చూడటం వల్లే క్యాన్సర్ వస్తుందని ఇప్పటికైతే పూర్తి ఆధారాలు లభించలేదని పరిశోధకులు వెల్లడించారు. ఈ దిశగా మరింత అధ్యయనం అవసరమని వారు పేర్కొన్నారు. కాకపోతే, మన జాగ్రత్తలో మనం ఉండాలని సూచిస్తున్నారు. కాబట్టి, స్క్రీన్ టైం తగ్గించుకోవడం, చూసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం లాంటివాటితో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.